హార్ట్ ఫుల్ నెస్, శ్రీ రామ చంద్ర మిషన్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల అధ్వర్యంలో వచ్చే నెల 3, 4, 5వ తేదీలలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో యోగ మహోత్సవ కార్యక్రమం పై నిర్వహిస్తున్నారు. ఇందులో ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, ఆయుర్వేదము, ధ్యానం నేర్పనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఈ ఉత్సవం ఒకటి ముగిసింది, తాజాగా వరంగల్ లో ఇదే ఉత్సవాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారం అందిస్తోంది.
పలు ఆసనాల గురించి ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా తెలుసుకునే విధంగా, సమగ్ర అవగాహన కలిగించేలా 3 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వటం ఈ ఉత్సవాల ప్రత్యేకత. భారతదేశ అమృత మహోత్సవాల సందర్భంగా ఈ యోగ మహోత్సవాలను హార్ట్ ఫుల్ నెస్ సంస్థ “హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్” అనే నినాదంతో నిర్వహిస్తోంది. ప్రతి హృదయం ధ్యానించాలి, ప్రతి రోజు ధ్యానించాలి అని నినదిస్తూ ఈ ఉద్యమాన్ని నిర్మించేలా ప్రత్యేక కార్యక్రమాలను సంస్థ అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం పోస్టర్స్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు.