Harish Rao on Evm symbols: రాబోయే ఎన్నికల్లో కారును పోలిన అనేక గుర్తుల పట్ల ఓటర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని బీఆర్ ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే బీఆర్‌ఎస్ గుర్తు అయిన కారును పోలిన ఇతర గుర్తులు ఈవీఎంలలోకి వచ్చాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఓటు వేసేటప్పుడు ఓటర్లు తమ గుర్తును గుర్తించడంలో గందరగోళానికి గురై, వేరే గుర్తులపై ఓటు వేసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ గందరగోళాన్ని నివారించడానికి ఓటర్లకు ఒక కీలక సూచన చేశారు హరీష్ రావు. ఈవీఎంలలో ఏమాత్రం సందేహం వచ్చినా, దయచేసి అభ్యర్థి ఫోటోను స్పష్టంగా చూసి, ఆ తర్వాత మాత్రమే ఓటు వేయండని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా బీఆర్‌ఎస్ ఓట్లు చీలిపోకుండా కాపాడుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ, ఈ కుట్రలన్నీ “దింపుడుకళ్లెం ఆశలు” అని, వీటితో బీఆర్‌ఎస్‌ను ఓడించడం సాధ్యం కాదని ఆయన ఎద్దేవా చేశారు.
మాగంటి సునీత వివాదంపై స్పందన:
ఇదే సందర్భంగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన మాగంటి సునీతపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యక్తిగత విమర్శలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. సునీత గోపినాథ్ గారి భార్య కాదని, ఆమెను అగౌరవపరిచే విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారని ఆయన ఆరోపించారు.
సునీత తన మనసులోని బాధను వ్యక్తం చేసి ఏడిస్తే, దాన్ని కూడా డ్రామాలు అని కాంగ్రెస్ నాయకులు విమర్శించారని అన్నారు. మాగంటి గోపినాథ్ గారి పిల్లలను కూడా అనేక రకాలుగా బాధ పెట్టడం తప్పన్నారు. ఇది మహిళలను అగౌరవపరిచే చర్యేనన్నారు. రాజకీయ విమర్శలు చేయవచ్చు కానీ, మహిళలను, వారి కుటుంబ సభ్యులను ఇలా వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు.


