తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తెలిపారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పీకర్‌ను అవమానించలేదని అన్నారు. సభలో ‘మీ’ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదని చెప్పారు. ‘మీ ఒక్కరిది’ అనే పదం కూడా అన్ పార్లమెంటరీ కాదన్నారు. కాంగ్రెస్ సభ్యులు ఎందుకు నిరసన వ్యక్తం చేశారో సభను స్పీకర్ ఎందుకు వాయిదా వేశారో అర్థం కావడం లేదని తెలిపారు. స్పీకర్‌ను కలిసి దీనిపై వివరణ ఇచ్చామన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడకుండా బ్లాక్ చేశారని ధ్వజమెత్తారు.
కాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారి తీశాయి. ఈ సందర్భంగా అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినానాదాలు చేయడంతో జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రన్నింగ్ కామెంట్రీ ఆపి మూసుకుని కూర్చోవాలని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సభ్యులు అసహనానికి గురికావొద్దని సభా సంప్రదాయాలను పాటించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ సూచించారు. అయితే స్పీకర్ వ్యాఖ్యల పట్ల జగదీశ్ రెడ్డి తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అందరికీ సమాన అవకాశాలున్నాయని.. కాకపోతే సభ్యుల తరపున పెద్ద మనిషిగా ఆ స్థానంలో కూర్చున్నారని తెలిపారు. అంతేతప్ప సభ స్పీకర్ సొంతం కాదని వ్యాఖ్యానించారు. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.