ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాలేదని ఊరుకున్నామని, లేకపోతే కాంగ్రెస్ సర్కారును చీల్చి చెండాడేవాళ్లమంటూ హరీష్ రావు గర్జించారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్.. ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి 45 రోజులవుతోందని, ఓటమి నుంచి తేరుకుని నెల రోజులకే సమీక్ష, సన్నాహక సమావేశాలు ప్రారంభించామన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడానికి బలమైన కారణాలు ఉండనక్కర్లేదని, ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాల కాలంలో ప్రభుత్వం మారడానికి ప్రజలకు పనికొచ్చే అంశాలు కూడా ఉండనక్కర్లేదని హరీష్ అభిప్రాయపడ్డారు. గ్యారంటీలు అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతుందని ఆయన హెచ్చరించారు, మన దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని, సాంప్రదాయ రాజకీయ పద్ధతులకు కేసీఆర్ దూరంగా ఉన్నారని అదే నష్టం చేసిందన్న భావన కార్యకర్తల్లో ఉందన్నారు.
దావోస్ వెళ్లడం అంటే ఖర్చు దండగ అని ప్రతిపక్షంలో ఉండగా ఉత్తమ్ అన్నారని ఇప్పుడు సీఎం రేవంత్ బృందం వెళ్లిందికదా దీన్ని ఉత్తమ్ ఎలా సమర్థించుకుంటారని హరీష్ నిలదీశారు.