Thursday, April 18, 2024
Homeట్రేడింగ్Davos summit: తెలంగాణలో 12,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అదానీ

Davos summit: తెలంగాణలో 12,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అదానీ

సీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ

తెలంగాణలో భారీ పెట్టుబడులకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మొత్తం రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందాలు (MoU) చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సీఈవో ఆశిష్ రాజ్‌వంశీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.

- Advertisement -

తెలంగాణలో అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తుంది. దీనికి రూ. 5 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది. చందన్వల్లిలో అదానీ కొనెక్స్ (AdaniConneX) డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర్పాటుకు రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ రాష్ట్రంలో రూ.1400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. అదానీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ పార్క్ లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలకు అదానీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది.

ఈ ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీకి హామీ ఇచ్చారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించిందని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ ఆనంద్ అన్నారు. కొత్త పారిశ్రామిక విధానం మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ఉందని, తమకందించిన ప్రోత్సాహంతో తెలంగాణలో అదానీ గ్రూప్ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

త్వరలో స్కిల్ యూనివర్సిటీ

ప్రజా పాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అత్యంత ప్రాధాన్యాల్లో ఒకటిగా ఎంచుకున్న స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై గౌతమ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. దీంతో యువతీ యువకుల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని.. పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని సీఎం అన్నారు. తెలంగాణలో తమ పెట్టుబడులతో పాటు స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు అదానీ తన సంసిద్ధతను వ్యక్తపరిచారు. త్వరలోనే ఇంటిగ్రేటేడ్ స్టేట్ ఆప్ ది ఆర్ట్ స్కిల్లింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అదానీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. ఇఫ్పటికే తెలంగాణలో అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, ప్రపంచంలోని వ్యాపార దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు తెలంగాణ మొట్టమొదటి గమ్యస్థానంగా మారిందని అన్నారు. అదానీ గ్రూప్ తెలంగాణను తమ పెట్టుబడులకు ఎంచుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News