ప్రభుత్వం ఈ ఏడాది కాళోజీ అవార్డు (Kaloji Award) ప్రకటించి ఇప్పటి వరకు ప్రదానం చేయకపోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9 కాళోజి జయంతి సందర్భంగా, ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత నలిమెల భాస్కర్ కి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం ప్రకటించి ఇప్పటి వరకూ ప్రదానం చేయకపోవడం శోచనీయం అని అన్నారు.
కాళోజి జయంతి నాడు సాహితీవేత్తలకు పురస్కారమిచ్చి, గౌరవించుకునే ఆనవాయితీని దురుద్దేశంతో విస్మరించడం దుర్మార్గం అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక్క భాస్కర్ కి మాత్రమే జరిగిన అవమానం కాదు… తెలంగాణ కవులందరికీ జరిగిన అవమానం అని మండిపడ్డారు. ఈరోజు కాళోజి కళాక్షేత్రం ప్రారంభం చేస్తున్న సందర్భంగా ఆయినా భాస్కర్ కి అవార్డు ప్రదానం చేయండి, చేసిన తప్పును సరి చేసుకోండి అంటూ హరీష్ రావు ప్రభుత్వానికి హితవు పలికారు.
నలిమెల కి కాళోజీ అవార్డు…
ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత నలిమెల భాస్కర్ కి ‘కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం’ దక్కింది. ప్రముఖ కవి అందెశ్రీ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుకు నలిమెలను ఎంపిక చేసింది. సెప్టెంబర్ 9న కాళోజి జయంతిని పురస్కరించుకొని 2015 నుంచి ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. కాళోజీ పురస్కారం కింద అర్హులకు అవార్డు, మొమెంటో, రూ. 1,01,116 నగదు బహుమతిని అందిస్తారు. అయితే ప్రభుత్వం ఈ ఏడాది కాళోజీ అవార్డు (Kaloji Award) కు నలిమెల భాస్కర్ పేరుని ప్రకటించినప్పటికీ ఆయనకు అవార్డును మాత్రం ప్రదానం చేయలేదు.