Himayath and Usman Sagar: హైదరాబాద్ నగరంలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల్లో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మెట్రో వాటర్ బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే మూడురోజులు మరింత వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జలాశయాల గేట్లు ఎప్పుడైనా ఎత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్‌ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తే మూసీ నది పొంగి ప్రవహించి చాదర్‌ఘాట్, జియాగూడ, అత్తాపూర్, నాగోల్, ముసారాంబాగ్ తదితర తక్కువ ఎత్తున్న ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ప్రజల ప్రాణాలకు ప్రమాదం తలెత్తకూడదనే ఉద్దేశంతో హైద్రాబాద్ మెట్రో వాటర్ బోర్డు ప్రజలకు ముందస్తు హెచ్చరిక జారీ చేసింది.
లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి
మూసీ నదీ తీరంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నీటి మట్టం మరింత పెరగవచ్చన్న అంచనాతో, పలు కాలనీల్లోని ప్రజలకు తాత్కాలిక నివాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లల్లో ఈ శిబిరాలు సిద్ధం చేశారు. పోలీస్, జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు సమన్వయంతో 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.
వంతెనలపై రాకపోకలపై ఆంక్షలు
ముసారాంబాగ్ వంతెన వద్ద వరద నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో, అక్కడ రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. మరింత నీటి ప్రవాహం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ఉస్మాన్ సాగర్‌ది 1790 అడుగులు. ప్రస్తుతం ఈ రెండు జలాశయాల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది. పూల్‌బాగ్, బండ్లగూడ జాగీర్, రాజేంద్రనగర్, నార్సింగి ప్రాంతాలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు.
మూసీ అభివృద్ధి ప్రణాళిక ఇప్పటికీ ప్రారంభ దశలోనే…
1908లో మూసీ నది ఉధృతి కారణంగా నగరంలో తీవ్ర నష్టం సంభవించింది. అప్పట్లో నిజాం ప్రభుత్వమే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను నిర్మించి వరద నియంత్రణ చర్యలు చేపట్టింది. అప్పటి నుంచి ఇవే వరద నివారణకు కీలకమైన ఆనకట్టలుగా నిలిచాయి. కానీ నగర విస్తరణ నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల్లో ఎన్నో ఇళ్లు అక్రమంగా నిర్మించబడ్డాయి. వర్షాకాలంలో జలాశయాల నుంచి నీరు విడుదల చేస్తే ముంపు ప్రమాదం తలెత్తడం ఇదే కారణం. ఇటీవలి కాలంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మూసీ నది అభివృద్ధికి ప్రణాళిక రూపొందించినప్పటికీ, ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. త్వరితగతిన ఆ ప్రణాళికను అమలుచేయాల్సిన అవసరం ఉంది.


