Montha Cyclone updates: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అది క్రమక్రమంగా బలపడుతూ.. నేడు తీవ్ర వాయుగుండంగా మారనుందని తెలిపింది. ఆ తర్వాత తుపాన్ గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో బంగాళాఖాతంతీర రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే.. బంగాళాఖాతంలో 27 నాటికి మొంథా అనే తీవ్ర తుపాన్ ఏర్పడనుందని తెలిపింది. ఈనెల 28న ఏపీలోని కాకినాడ దగ్గర తీరం దాటనుందని పేర్కొంది. దీని ప్రభావంతో గరిష్టంగా గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
దక్షిణ, మధ్య తెలంగాణలో భారీ వర్షాలు: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉండడంతో హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంచనా వేస్తోంది. రాష్ట్రంలో రాబోయే కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రయాణాలు తదితర పనులను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
నేడు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. వచ్చే రెండు రోజుల్లో మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన తీవ్ర వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, భుపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో సైతం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.


