Hyderabad Rains| హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, మూసాపేట, నిజాంపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట్, సికింద్రాబాద్, మాదాపూర్, ఎల్బీనగర్, మేడ్చల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండి మైసమ్మ, మల్లంపేట్, కొండాపూర్, లింగంపల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ వర్షానికి రహదారులు జలమయ్యాయి. దీంతో రోడ్డుపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఈ క్రమంలోనే లింగంపల్లి రైల్వే అండర్‌పాస్ కింద వరద నీరు భారీగా చేరడంతో ట్రాఫిక్ పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వస్తున్న వాహనాలను నల్లగండ్ల ఫ్లైఓవర్ వైపు మళ్లించారు. గ్రేటర్ మున్సిపల్ కార్మికులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సహాయం కోసం నగర వాసులు 040-21111111 or 9000113667 నెంబర్లను సంప్రదించాలని ఓ ప్రకటనలో తెలిపారు.
మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, సిద్ధిపేట, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.