Today Rains in tg: తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లిలలో సాయంత్రం వరకు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మిగిలిన జిల్లాల్లో చెల్లాచెదురుగా తేలికపాటి నుండి మితమైన వర్షపాతం మాత్రమే ఉంటుందన్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే సాయంత్రం వరకు ఒక మోస్తరు వర్షాలు కురిసి.. సాయంత్రం తర్వాత, స్వల్ప చినుకులు తప్ప, వాతావరణం ఎక్కువగా పొడిగా ఉంటుందన్నారు.
హైదరాబాద్ నగరంతో సహా మొత్తం తెలంగాణలో ఈరోజు పగలు, రాత్రి 40-55 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాల వారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో:
సంగారెడ్డి మరియు మెదక్ జిల్లాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. కౌడిపల్లి, పెద్ద శంకరంపేట, దామరంచ, మాసాయిపేటలలో అధిక వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లాలోని గౌరారంలో రికార్డు స్థాయిలో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అలాగే, ములుగు, మహబూబాబాద్, మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి మరియు పెద్దపల్లి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. నాగర్‌జునసాగర్, శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది.


