Telangana cabinet Expansion: మంత్రుల పనితీరుపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి పూర్తిస్థాయి నివేదికను అందించారు. మినిస్టర్స్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు, వారు సృష్టించిన వివాదాలను ప్రధానంగా ప్రస్తావించిన నివేదికపై.. హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. నలుగురు మంత్రులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జిల్లాల్లో కొనసాగిస్తున్న దందాలపై అధిష్టానం గరంగరం ఉన్నట్టుగా సమాచారం. ఇక ఏ మాత్రం ఆ మంత్రులను కేబినెట్‌లో కొనసాగించరాదని హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రాష్ట్ర కేబినెట్ ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతున్నది.
అన్ని వర్గాలకు ప్రయారిటీ: అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్టుగా .. కాంగ్రెస్ తన సోషల్ మీడియాలో ప్రకటించింది. అక్టోబర్ 31న అతడిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో ఇంకా రెండు స్థానాలు ఖాళీగా ఉంటాయి. అయితే వీటిని కూడా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే భర్తీ చేయాలని హైకమాండ్ యోచిస్తున్నది. అలా కాకుండా రెండు స్థానాల కోసం మరోసారి కేబినెట్‌ను విస్తరిస్తే.. సామాజిక సమీకరణాల కూర్పు కష్టంగా ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అందుకనే ప్రక్షాళన చేసే సమయంలోనే అన్ని వర్గాలకు ప్రయారిటీ ఇవ్వొచ్చని దిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
పనితీరు ఆధారంగా పదవులు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. సీఎం రేవంత్‌రెడ్డితో కలిపి 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో పనితీరు సరిగా లేని మంత్రులను స్థానిక ఎన్నికల తర్వాత పక్కన పెడతారని ప్రచారం జరుగుతోంది. కొంత మంది మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఆశించిన స్థాయిలో పనిచేయలేదని విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా మరికొందరిపై అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఈ నేపథ్యంలో సదరు మంత్రులను ఇక ఏ మాత్రం కేబినెట్‌లో ఉంచే అవకాశం లేదని.. దిల్లీ పెద్దలు రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ మంత్రుల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరిగినట్టుగా అధిష్టానం భావిస్తోంది.
ఇద్దరు బీసీ, ఇద్దరు ఓసీ మంత్రులకు షాక్!: కేబినెట్ ప్రక్షాళన సమయంలో ఇద్దరు బీసీ వర్గానికి చెందిన మంత్రులు, ఇద్దరు ఓసీ వర్గానికి చెందిన మంత్రులను హైకమాండ్ తప్పించే అవకాశం ఉందని.. రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు సమాచారం అందింది. అయితే వారి స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి మళ్లీ కేబినెట్‌లోకి తీసుకుంటారని సమాచారం. అలా తీసుకోకపోతే ఆయా వర్గాల నుంచి విమర్శలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన హైకమాండ్ మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తోన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ప్రక్షాళన వరకు ఓపిక పట్టాలని ఇప్పటికే సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైలెంట్ అయ్యారని సమాచారం. తనకి మంత్రివర్గంలో స్థానం కాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి.


