Hoardings on CM Revanth Reddy: సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ సమీపంలో ప్రత్యక్షమైన కొన్ని హోర్డింగ్‌లు రాజకీయ వేడి పెంచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీవ్రమైన అవినీతి జరుగుతోందని, సీఎం రేవంత్ రెడ్డి హయాంలో జరుగుతున్న AటుZ మోసాలు అంటూ.. తీవ్ర విమర్శలు చేస్తూ ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ హోర్డింగ్‌ల్లో ఏ టు జెడ్ వరకు అవినీతి, కాంట్రాక్టుల వరుసగా సీఎం బంధువులకు మంజూరు, కమిషన్ల వేట, భూకబ్జాలు, రైతులపై దాడులు, నకిలీ పెట్టుబడి పాసులు, అక్రమ కూల్చివేతలు వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ కొనసాగుతోంది.
ఈ పోస్టర్లను బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు ఏర్పాటు చేశారని సమాచారం, అయితే అధికారికంగా ఎవరూ దీనిపై స్పందించలేదు. కొన్ని వర్గాలు దీని వెనక బీజేపీకి చెందిన వ్యక్తుల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయంగా విపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో భాగంగా ఇది ఒక వ్యూహాత్మక ప్రయత్నమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల స్పందన – హోర్డింగ్‌లు తొలగింపు
హోర్డింగ్‌లు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉండటంతో, రాత్రికి రాత్రే కంటోన్మెంట్ అధికారులు స్పందించి హోర్డింగ్‌లను తొలగించారు. అనుమతి లేకుండా ఇలా హోర్డింగ్‌లు వేయడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోందని సమాచారం. ఇది ప్రభుత్వంపై సరైన ఆరోపణలా, లేకపోతే రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా చూడాలా అనే ప్రశ్న ప్రస్తుతం సామాజిక, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ వర్గాలు దీనిపై అధికారికంగా స్పందించకపోయినా, బీఆర్‌ఎస్ వర్గాలు మాత్రం అధికారులను ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లతో దాడి చేస్తుండటం గమనార్హం.


