Saturday, November 15, 2025
HomeతెలంగాణReal Estate Trends: జాతకం చూసి.. జాగా కొంటున్నారు! వాస్తును దాటిన నమ్మకాలు!

Real Estate Trends: జాతకం చూసి.. జాగా కొంటున్నారు! వాస్తును దాటిన నమ్మకాలు!

Numerology in home buying : సొంత ఇల్లు.. ప్రతి ఒక్కరి జీవితంలో అదొక పెద్ద కల. ఆ కలను సాకారం చేసుకునే క్రమంలో వాస్తు చూడటం సర్వసాధారణం. సింహద్వారం ఎటువైపు ఉండాలి? పూజగది ఎక్కడ రావాలి? వంటగది ఆగ్నేయంలో ఉందా? ఇలాంటి లెక్కలన్నీ చూశాకే ఇంటిని ఎంపిక చేసుకుంటారు. కానీ, ఇప్పుడు కొనుగోలుదారుల ఆలోచనా విధానం మారింది. వాస్తు ఒక్కటే సరిపోదు, జాతకం కూడా కలవాలంటున్నారు. తమ జన్మ నక్షత్రానికి ఏ దిక్కు అచ్చొస్తుంది? తాము కొనే ఫ్లాట్ నంబరు తమకు యోగిస్తుందా? ఏ అంతస్తులో అడుగుపెడితే అదృష్టం తలుపు తడుతుంది? అంటూ సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం వైపు మొగ్గు చూపుతున్నారు. అసలు ఈ కొత్త నమ్మకాల వెనుక ఉన్న కారణాలేంటి? కొనుగోలుదారుల ఈ సెంటిమెంట్లను బిల్డర్లు ఎలా చూస్తున్నారు? మారుతున్న ఈ ట్రెండ్ నిర్మాణ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది?

- Advertisement -

ఒకప్పుడు ఇంటి కొనుగోలు అంటే బడ్జెట్, ప్రదేశం, సౌకర్యాలు, వాస్తు.. ఈ నాలుగు అంశాల చుట్టూనే తిరిగేది. కానీ నేడు దీనికి ‘వ్యక్తిగత నమ్మకాలు’ అనే ఐదో అంశం బలంగా తోడైంది. నిర్మాణ సంస్థలు సైతం ఈ కొత్త ధోరణిని గమనించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

వాస్తును మించిన సంఖ్యాశాస్త్రం: ఆకాశహర్మ్యాల్లో వందలాది ఫ్లాట్లు ఉన్నప్పుడు, ఒకేలాంటి డిజైన్, ఒకే విస్తీర్ణం ఉన్న ఫ్లాట్ల నుంచి తమకు ఏది కావాలో తేల్చుకోవడానికి కొందరు కొనుగోలుదారులు సంఖ్యాశాస్త్రాన్ని ఆశ్రయిస్తున్నారు.

అంతస్తుల ఎంపిక: కొందరు 13వ అంతస్తును అశుభంగా భావించి పూర్తిగా వద్దంటున్నారు. అదే సమయంలో 12, 14 వంటి అంతస్తులకు మొగ్గు చూపుతున్నారు. తమకు కలిసొచ్చే సంఖ్య వచ్చేలా ఫ్లోర్‌ను ఎంచుకుంటున్నారు.

ఫ్లాట్ నంబర్ల లెక్క: కొనే ఫ్లాట్ నంబర్  మొత్తం తమ పుట్టిన తేదీకి సరిపోవాలని, లేదా తమకు అదృష్ట సంఖ్య అయ్యుండాలని భావిస్తున్నారు. ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందని, అది ఇంట్లోని సానుకూల వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని బలంగా విశ్వసిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా న్యూమరాలజిస్టులను సంప్రదించి మరీ తుది నిర్ణయం తీసుకుంటున్నారు.

జన్మ నక్షత్రం.. ఇంటి దిక్కు: సంఖ్యాశాస్త్రంతో పాటు, జన్మ నక్షత్రం ఆధారంగా ఇంటి దిక్కును ఎంచుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

ప్రాంతీయ నమ్మకాలు: ముఖ్యంగా తమిళులు ఎక్కువగా దక్షిణం వైపు ముఖద్వారం ఉన్న నివాసాలకు ప్రాధాన్యత ఇస్తారని, అది వారికి కలిసి వస్తుందని నమ్ముతారని బిల్డర్లు చెబుతున్నారు.
వ్యాపారస్తుల వ్యూహం: కొందరు వ్యాపారులు సైతం తమ వ్యాపార వృద్ధికి దక్షిణం దిక్కు అనుకూలిస్తుందని భావించి అలాంటి ఇళ్లనే ఎంపిక చేసుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఉత్తరం, తూర్పు దిక్కులకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ, వ్యక్తిగత జాతకం ప్రకారం తమకు సరిపోయే దిక్కు ఏదో చూసుకుని నిర్ణయం తీసుకుంటున్నారు.

భావోద్వేగ బంధం.. తరాలతో సంబంధం లేదు: సొంత ఇంటితో ప్రతి ఒక్కరికీ ఓ భావోద్వేగ బంధం ఉంటుంది. ఆ ఇంట్లోకి అడుగుపెట్టాక అంతా మంచే జరగాలని, శుభాలు కలగాలని కోరుకుంటారు. ఈ నమ్మకం పాత తరం వారికే పరిమితం కాలేదు. నేటి యువత, విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు సైతం ఇంట్లో పెద్దల మాటలకు విలువ ఇచ్చి ఈ సెంటిమెంట్లను పాటిస్తున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా, సంప్రదాయ నమ్మకాలు తమ జీవితంలో భాగమేనని వారు భావిస్తున్నారు.

నిపుణులు ఏమంటున్నారు : ఈ కొత్త ధోరణులపై నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు ఎం. విజయసాయి మాట్లాడుతూ, “జన్మ నక్షత్రం, సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇళ్లు ఎంపిక చేసుకునేవారు ఉన్నారు, కానీ వీరి సంఖ్య ఇంకా తక్కువే. ఎక్కువ మంది వాస్తుకే ప్రాధాన్యం ఇస్తారు. తూర్పు, పశ్చిమ, కార్నర్ ఫ్లాట్ల వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు. అయితే, ఇప్పుడు అపార్ట్‌మెంట్ సంస్కృతిలో పశ్చిమం వైపు ఫ్లాట్లకు ఆదరణ పెరుగుతోంది. దీనికి వాస్తుతో పాటు శాస్త్రీయ కారణం కూడా ఉంది. పశ్చిమం వైపు ఉన్న ఫ్లాట్లలోని వంటగదిలోకి సరైన వెలుతురు, గాలి ప్రసరణ ఉంటుంది. ఇది గృహిణుల ఆరోగ్యానికి మంచిది. ఒకే రకమైన ఫ్లాట్లు వేర్వేరు అంతస్తుల్లో ఉన్నప్పుడు మాత్రమే కొందరు సంఖ్యాశాస్త్రం వంటివి చూస్తున్నారు” అని విశ్లేషించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad