Saturday, November 15, 2025
HomeతెలంగాణSAFETY FIRST : టపాసుల మోత ఆగింది.. ప్రమాదం పొంచి ఉంది! మిగిలిన బాణసంచాతో జర...

SAFETY FIRST : టపాసుల మోత ఆగింది.. ప్రమాదం పొంచి ఉంది! మిగిలిన బాణసంచాతో జర భద్రం!

Safe storage of firecrackers : దీపావళి వేడుకలు ముగిశాయి, ఆనందాలు మిగిలాయి.. వాటితో పాటే కొన్ని టపాసులు కూడా! పండగ తర్వాత మిగిలిపోయిన ఈ బాణసంచాను ఏం చేయాలో తెలియక, చాలామంది ఇళ్లలో, దుకాణాల్లో అటక మీద పడేస్తుంటారు. కానీ, ఆ చిన్న నిర్లక్ష్యమే పెను ప్రమాదానికి దారితీయవచ్చని, చిన్న నిప్పురవ్వ చాలు, ఊహించని నష్టాన్ని కలిగించడానికి అని అగ్నిమాపక శాఖ అధికారులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అసలు మిగిలిన టపాసులను ఎలా భద్రపరచాలి..? వాటి వల్ల పొంచి ఉన్న ప్రమాదాలేంటి..?

- Advertisement -

ప్రమాదానికి చిరునామాలు : పండగ తర్వాత, టన్నుల కొద్దీ టపాసులను దిగుమతి చేసుకున్న వ్యాపారులు, మిగిలిపోయిన సరుకును జనావాసాల మధ్య ఉన్న ఇళ్లు, గోదాములలో నిల్వ చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. తేమ, వేడి, చిన్న ఘర్షణకు కూడా ఈ టపాసులు పేలిపోయే ప్రమాదం ఉంది.

భద్రపరచడం ఎలా? నిపుణుల సూచనలు : మిగిలిపోయిన టపాసులను సురక్షితంగా నిల్వ చేయడానికి, అధికారులు కొన్ని కీలక సూచనలు జారీ చేశారు.
జనావాసాలకు దూరం: టపాసులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లలో భద్రపరచకూడదు. జనావాసాలకు దూరంగా ఉన్న గోదాములలోనే ఉంచాలి.
వేడి, వెలుతురుకు దూరం: గాలి, వెలుతురు తగలని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ల వంటి పేలుడు పదార్థాలకు దూరంగా ఉంచాలి.
ఘర్షణ నివారణ: టపాసుల మధ్య ఘర్షణ జరిగినా పేలే ప్రమాదం ఉంది. కాబట్టి, వాటిని వేర్వేరు డబ్బాలలో, ఐరన్ రిసెప్టకిల్స్‌తో వేరుచేసి భద్రపరచాలి.
అగ్నిమాపక ఏర్పాట్లు: గోదాములో డ్రై కెమికల్ సిలిండర్లు, ఇసుక బకెట్లు, వాటర్ ట్యాంకు, స్మోక్ డిటెక్టర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.

గాయాలైతే.. నిర్లక్ష్యం వద్దు : టపాసుల వల్ల గాయాలైతే, వెంటనే సరైన ప్రథమ చికిత్స చేసి, వైద్యుడిని సంప్రదించడం అత్యవసరం.
కంటి గాయాలు: టపాసుల నిప్పురవ్వలు కళ్లలో పడితే, వాటిని చేతితో గుంజడానికి ప్రయత్నించవద్దు. చల్లటి నీటితో కళ్లను శుభ్రంగా కడిగి, వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. ఇంట్లో ఉండే ఐ డ్రాప్స్‌ను వాడటం మరింత ప్రమాదకరం.

కాలిన గాయాలు: గాయంపై వెంటనే చల్లటి నీటిని పోయాలి. ఎలాంటి ఆయింట్‌మెంట్లు రాయకుండా, శుభ్రమైన గుడ్డతో కప్పి, ఆసుపత్రికి తరలించాలి.

“టపాసులు పేలి కంటిలోని నల్ల గుడ్డుకు నష్టం వాటిల్లితే, చూపును 30-40 శాతం మాత్రమే తిరిగి తీసుకురాగలం. గాయాలైన తర్వాత బాధపడే కంటే, ముందే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.”
– డాక్టర్ లింబాద్రి, కంటి వైద్య నిపుణులు

కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి : టపాసులు కాల్చేటప్పుడు కళ్లద్దాలు ధరించడం, కాటన్ దుస్తులు వేసుకోవడం మంచిది. చేతితో కాకుండా, పొడవైన కాకరపువ్వొత్తితో వెలిగించాలి. కాంటాక్ట్ లెన్స్‌లు ధరించి టపాసులు కాల్చవద్దు. వేడికి అవి కంటికి అతుక్కుపోయే ప్రమాదం ఉంది. పిల్లలను ఒంటరిగా టపాసులు కాల్చడానికి అనుమతించవద్దు. పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad