పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బృందం పర్యటన కొనసాగుతోంది. తాజాగా విప్రో (Wipro) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో సీఎం రేవంత్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై వివరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో కొత్త సెంటర్ ఏర్పాటుకు విప్రో అంగీకారం తెలిపింది. మూడేళ్లలో సెంటర్ పూర్తిచేస్తామని వెల్లడించింది. ఈ సెంటర్ ద్వారా 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపింది.
హైదరాబాద్‌లో విప్రో విస్తరణ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి స్వాగతించారు. విప్రో వంటి ప్రఖ్యాత సంస్థలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విప్రో విస్తరణతో తెలంగాణలో ఐటీ రంగం మరింత వృద్ధి చెందుతుందన్నారు. ఇక విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ మాట్లాడుతూ… కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, అవకాశాలను సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.