Friday, September 20, 2024
HomeతెలంగాణHusnabad: అభివృద్దే నా ఎజెండా, సంక్షేమమే నా అభిమతం

Husnabad: అభివృద్దే నా ఎజెండా, సంక్షేమమే నా అభిమతం

అభివృద్ధి నా ఎజెండా.. సంక్షేమం నా అభిమతం.. అభివృద్ధి, సంక్షేమం కోసం.. రాజీ పడేది లేదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఉద్వేగంగా అన్నారు. హుస్నాబాద్ పట్టణ శివారు మీర్జాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న శుభం గార్డెన్ ఫంక్షన్ హాల్ లో హుస్నాబాద్ మండల బీ ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడారు. “ఏళ్లకేళ్లుగా కరవుతో అల్లాడిన నేల హుస్నాబాద్.. కానీ గడచిన పదేళ్లలో సిఎం కేసీఆర్ కృషితో గోదావరి జలాలు తీసుకువచ్చి కరవును జయించాం.. అన్ని రంగాల్లో హుస్నాబాద్ ను అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నాం.. దీనికి ప్రజలు మద్దతునివ్వాలి… మరోసారి ప్రజల ఆశీర్వాదం కావాలి” అని ఎమ్మెల్యే అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని వైద్య పరంగా, విద్యాపరంగా, రోడ్లు, మౌలిక సదుపాయాల పరంగా ఎంతగానో తీర్చిదిద్దాం.. ఇది ప్రజల మద్దతుతో సాధ్యమైందని ఎమ్మెల్యే అన్నారు. గతంలో ఎన్నడూ లేని గుర్తింపు హుస్నాబాద్ కు నేడు వచ్చింది… నాలుగు జిల్లాలకు కేంద్రంగా హుస్నాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది…. ఇది ఇంకా కొనసాగాలని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందుతోంది, ఎరువులు, విత్తనాల కొరత లేదు, ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వమే చేస్తోంది.. రైతు బంధు, రైతు బీమా అమలవుతోంది.. ఆసరా పింఛన్లు వస్తున్నాయి… కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నిరుపేదలకు అందుతోందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు తెచ్చామని, కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లు తెచ్చి లో వోల్ట్టేజి కొరత లేకుండా చేశామని, కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేశామని, రైతు వేదికలు నిర్మించామని తెలిపారు. సిద్దిపేట ఎల్కతుర్తి రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది… హుస్నాబాద్ కు మంచి భవిష్యత్ ఉందని అయన స్పష్టం చేసారు. కోట్లాది రూపాయలతో హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు.

- Advertisement -

గౌరవెల్లికి గంగమ్మ

సిఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుల కృషితో.. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశామని, త్వరలోనే ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. గౌరవెల్లిని అడ్డుకునేందుకు ఎన్నో అడ్డంకులు ప్రతిపక్షాలు సృష్టించాయి. కోర్టుల్లో కేసులు వేయించారు. గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లి ఆపాలని చూసారు. నిర్వాసితులను రెచ్చగొట్టారు.. అయినా.. ఎన్నో అడ్డంకులను అధిగమించి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశామని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. ఇప్పటివరకు రైతన్నలు ఎంతో గోసపడ్డారు.. వారి కష్టాలు తీరాలనే సంకల్పంతో.. ముందుకువెళ్ళాం.. నిర్వాసితులకు న్యాయం చేసాం.. ప్రాజెక్టు పనులు విజయవంతంగా పూర్తి చేసాం అని అయన తెలిపారు. రైతుల తలాపునకు గంగమ్మను తెచ్చామని, వారి కష్టాలు తీరతాయని, వందల ఏళ్ల కరవును రూపుమాపిన ఘనత సి ఎం కేసీఆర్ దని అయన అన్నారు. కాళేశ్వరం జలాలు మిడ్ మానేరు ద్వారా తోటపల్లి నుండి గౌరవెల్లికి చేరతాయని, ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తి చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వాలు గౌరవెల్లిని చేయలేకపోయామని, కానీ సంకల్పంతో, కృషితో పట్టుదలతో.. తాము గౌరవెల్లిని పూర్తి చేశామని రైతుల వరప్రదాయిని, జీవ కాల్వ గౌరవెల్లి ప్రాజెక్టు అని ఎమ్మెల్యే అభివర్ణించారు.

కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా : ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
బీ ఆర్ ఎస్ పార్టీకి కార్యకర్తలు గుండెకాయ… రెండుసార్లు హుస్నాబాద్ లో భారీ విజయం సాధించేందుకు గులాబీ సైనికులు అలుపెరుగకుండా, ఎన్ని కష్టాలెదురైనా.. నాకు అండగా నిలిచారు.. శ్రమించారు. వారికి అండగా ఉంటాను.. వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఉద్వేగంగా అన్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీ బీ ఆర్ ఎస్ అని, అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రజలకు సి ఎం కేసీఆర్ పై నమ్మకం విశ్వాసం ఉన్నాయని అందుకే రెండుసార్లు ప్రజలు అధికారం కట్టబెట్టారని, ప్రజల మద్దతుతో, గులాబీ సైనికుల కృషితో మూడోసారి రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ అధికారం లోకి రావడం ఖాయమని అన్నారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గడప గడపకు తీసుకువెళ్లాలని, విభేదాలు పక్కనబెట్టి సమన్వయంతో పని చేయాలని అయన కోరారు. సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పాలని, వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీకోసం పనిచేసే కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని, అవకాశాలు ఉంటాయని అన్నారు. బీ ఆర్ ఎస్ పార్టీకి ఉన్న కార్యకర్తల బలం, పని చేసే వ్యవస్థ ఏ పార్టీకి కూడా లేవని, ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ సత్తా చాటిందని అయన గుర్తు చేసారు. ఈ సమావేశంలో బీ ఆర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News