Wednesday, September 18, 2024
HomeతెలంగాణHuzurabad: మళ్లీ వచ్చే సంవత్సరం కలుద్దాం

Huzurabad: మళ్లీ వచ్చే సంవత్సరం కలుద్దాం

అగిలీ బరస్ తుమ్ జల్దీ ఆనా..

గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తులందరూ భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల తనపై చూపుతున్న భక్తి భావాన్ని ”తెలుగు ప్రభ” దిన పత్రిక పాఠకులతో పంచుకునేందుకు ఆ గణనాథుడు మీ ముందుకు వచ్చాడు. ఇంకెందుకు ఆలస్యం ఆ గణనాధుని అభిప్రాయాన్ని విందామా మరి… భక్తి భావంతో తొమ్మిది రోజులపాటు మీరు నాకు పూజలు చేయడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భక్తి భావంతో ఈ తొమ్మిది రోజులపాటు నన్ను పూజించడం చూస్తుంటే ప్రజల్లో రోజురోజుకు భక్తి భావం పెరుగుతుంది అనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎంతో బిజీ జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ఈ తొమ్మిది రోజుల తమ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించి నన్ను పూజించడం చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. నన్ను తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజించిన నా భక్తులందరూ ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని దీవిస్తున్నాను.
👉నాకు పూజలు చేస్తున్న పేరుతో ఇతరులను ఇబ్బంది పెట్టకండి…
తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో నన్ను పూజిస్తున్న మీ అందరిలో కొంతమంది నిమజ్జనం చేసే రోజు డీజే ల పేరుతో ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు. నన్ను నిమజ్జనం చేసే సమయంలో మద్యం సేవించడం సరైన పద్ధతి కాదు. తొమ్మిది రోజులు ఎంతో భక్తితో నన్ను పూజించిన నా భక్తులేన ఇలా చేస్తుందనే బాధ కలుగుతుంది. నా బాధను అర్థం చేసుకోనైనా మీరు నన్ను నిమజ్జనం చేసే రోజు మద్యానికి దూరంగా ఉండి భక్తి పాటలతో నిమజ్జనానికి తరలి వెళ్తారని ఆశిస్తున్నాను.
👉చివరగా ఒక మాట…
నా నవరాత్రి ఉత్సవాల పేరుతో ఎవరికి ఇబ్బంది కలిగించకండి. మీకు ఉన్నంతలో నన్ను పూజిస్తే సరిపోతుంది. కానీ కొంతమంది నా భక్తులు హంగు హార్భాటాల పేరుతో చందాలు వసూలు చేస్తున్నారు. బలవంతంగా చందాలు వసూలు చేసే సంస్కృతి మంచిది కాదు. మీ జల్సాల కోసం నా పేరును వాడుకొని వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకుల వద్దకు వెళ్లి బలవంతంగా చందాలు వసూలు చేయడం చూస్తుంటే బాధ కలుగుతుంది. వచ్చే నవరాత్రి ఉత్సవాల నాటికైనా ఈ సంస్కృతికి చరమగీతం పాడుతారని ఆశిస్తున్నాను. అందరూ నా నిమజ్జన వేడుకల్లో సంతోషంగా పాల్గొనాలని కోరుకుంటున్నాను. వెళ్ళొస్తా…… మీ వినాయకుడు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News