Saturday, November 23, 2024
HomeతెలంగాణHuzurabad: 4 నెలల కాంగ్రెస్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారు

Huzurabad: 4 నెలల కాంగ్రెస్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారు

మన గోదారి నీళ్లు తరలిస్తారు

గెలుపోటములు తాత్కాలికమైనవి ప్రజల కోసం పనిచేయడమే శాశ్వతం అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం వీణవంకలోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లినప్పుడు నేను మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనికే తిరిగి వస్తానని చెప్పి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలోకి తిరిగి వచ్చానని అన్నారు. ఆ మాట చెప్పడానికి ఎంత ఆత్మవిశ్వాసం గుండె నిబ్బరం ఉందో మీరే తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా ముసలి వాళ్ళని ఆదుకోవాలని ఆసరా పెన్షన్ను 200 నుంచి 1000 రూపాయలు పెంచామని తర్వాత దానిని రెండువేల వరకు చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు 20 ఎకరాలు భూమి ఉన్న ఆసామి కూడా వలసలు వెళ్లారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్ల కోసం ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదు అని నీళ్ల బాధ తీర్చాలని భావించి చెరువులు బావులు నీళ్లతో నింపామన్నారు. తెలంగాణ ప్రజలకు సాగునీరు తాగునీరు అందక గందరగోళ స్థితిలో ఉన్నారని అన్నారు.

తెలంగాణలో ఉన్న కష్టాలన్నిటిని ఒకటొకటి తీరుస్తూ పునర్నిర్మాణం చేస్తూ వచ్చామన్నారు. రైతు బాగుండాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలని రైతులకు ఏ ఇబ్బంది జరగకుండా ఉండేందుకు అన్ని విధాల ఆలోచించి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టామని, ఇంకా రైతుల కోసం ఉచిత విద్యుత్ తో పాటు రైతు బీమా పథకాన్ని కూడా అమలుచేసి వారిలో ఉత్సాహాన్ని నింపామన్నారు.

సమైక్యాంధ్రప్రదేశ్లో 53 లక్షల టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ మూడు కోట్ల టన్నులకు మించి ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రైతుల కోసం కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతులు ఇక చాలు మాకు అనే వరకు సాగునీరు అందించామన్నారు. రైతులకు ఇబ్బంది కలగకూడదని ప్రతి గింజను కూడా కొనుగోలు చేశామని, అలాగే తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేసి వారిని ఆదుకున్నామన్నారు. రైతులు పండించిన పంటను దళారీల పాలు చేయకుండా ఉండేందుకు కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టు కాపాడుకున్నామన్నారు.

రైతులకు ఫ్రీ కరెంట్ కోసం 12,000 కోట్లు రైతుబంధు కోసం 15,000 కోట్లు ఖర్చు పెట్టామని వరి కొనుగోలుతో 750 కోట్లు నష్టం అయినా పర్వాలేదని 7500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల వద్ద నుంచి ప్రతి గింజను కొనుగోలు చేశామన్నారు. దళితుల కోసం దళిత బంధు పథకాన్ని కూడా తీసుకువచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపామని అన్నారు. దళిత బంధు పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఎన్నికలు వచ్చాయని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పథకాలు నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచారని అన్నారు. కౌశిక్ రెడ్డి లాంటివాడు యువకుడని ఇంకా రాజకీయాల్లో ఎంతో ఎదిగే సత్తా ఉందని కొనియాడారు. ఇది తాత్కాలికమైన వెనకడిగేనని ప్రజల కోసం ఓడిన గెలిచిన పని చేయడమే తనకు తెలుసు అన్నారు. డిసెంబర్ 9న రైతుబంధు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు కోతలు అయినప్పటికీ రైతుబంధు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ కూడా అసూయపడేలా తెలంగాణకు పెట్టుబడులు తమ పాలనలో వచ్చాయన్నారు.

ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కూడా గడవకముందే ప్రజలు పాలనను అసహ్యించుకుంటున్నారని, కాంగ్రెస్ అసమర్ధ పాలన చూసిన తెలంగాణ మరోసారి తిరగబడిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సరిగా లేక 1000 కోట్లు పెట్టుబడే పెట్టే కంపెనీ కూడా తమిళనాడుకు వెళ్లి పోయిందని, అది చూసి చాలా బాధనిపించిందని అన్నారు. 2001లోనే ఉద్యమంలో హుజురాబాద్ గడ్డ చురుకుగా పాల్గొని ఉద్యమానికి ఊతమందించింది అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పటికీ అప్పుడు జెడ్పిటిసి లను ఎంపీటీసీలను గెలిపించి బిఆర్ఎస్కు అండగా నిలిచిందన్నారు. తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదని పునర్నిర్మాణ ప్రక్రియ మిగిలే ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి నాలుగు నెలలు గడవకముందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత మూటగట్టుకుందని ఐదేళ్లపాటు పాలన ఎలా కొనసాగిస్తుందో తెలియడం లేదన్నారు. తెలంగాణలో తిరిగి మధ్యంతర ఎన్నికలు వచ్చిన లేక సార్వత్రిక ఎన్నికలు వచ్చిన మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.

గడచిన తొమ్మిదేళ్లలో పూర్తిస్థాయిలో వచ్చిన కరెంటు ఈరోజు ఎందుకు రావడం లేదో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలన్నారు. తెలంగాణలో ప్రజలు మళ్ళీ తాగునీరు కోసం బిందెలు పట్టుకొని బయటకు వెళ్తున్నారని కనీసం తెలంగాణ ప్రజలకు తాగునీరు అందించకపోవడం దారుణమని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వైద్యం కోసం అన్ని ఏర్పాట్లు చేసి ప్రసూతి సమయంలో గర్భిణీకి న్యూట్రిషన్ కిట్టు తో పాటు పుట్టిన తర్వాత కెసిఆర్ కిట్ ని కూడా అందించామని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా సరైన సౌకర్యాలు అందడం లేదని, వరంగల్ ఎంజీఎం లో ఏసీలు పనిచేయకపోవడంతో పసికందులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రజలు అయినా ఏమాత్రం ప్రేమ లేదని అందుకే అన్ని విషయాల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన గోదావరిని తమిళనాడు, కర్ణాటకకు ఇస్తానని చెప్పి ప్రభుత్వానికి చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. అదే జరుగుతే తెలంగాణలో సాగునీరు తాగునీరుకి చాలా ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు. గతంలో రైతులకు అన్యాయం చేసే ఏ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే దానిని తిప్పికొడుతూ కేంద్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పేవాన్ని అని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నిలిచిన వారిని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఆపద వస్తే పార్లమెంట్లో దుంకి అందుకొని కొట్లాడుతారని అన్నారు., బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదని ఆయన గతంలో ఎన్నోసార్లు తెలంగాణ హక్కుల కోసం కొట్లాడారని అన్నారు. తన ప్రచారాన్ని ఆపేందుకు కాంగ్రెస్ బిజెపిలు కుట్రలు పన్నాయని, అందుకే 48 గంటల ప్రచారాన్ని నిలిపివేసేలా చేశారని అన్నారు.

పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పడుకోని నెత్తి పోచమ్మ కొట్టినట్టు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. కరీంనగర్ పార్లమెంటులో హుజురాబాద్ నియోజకవర్గం 10.5% ఓట్లు బిఆర్ఎస్ పార్టీకి అధికంగా ఉన్నాయని వాటిని మరింత కష్టపడి 15 శాతానికి పెంచాలని అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజశేఖర్ రావు బీఆర్ఎస్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News