ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ -వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశాలకు ఎమ్మెల్యే జిఎంఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒక్క ఫోటో వంద మాటలకు సమాధానం ఇస్తుందని, ప్రతి ఫోటో వెనుక ఒక జ్ఞాపకం దాగి ఉంటుందని అన్నారు. ఫోటోగ్రఫీ రంగం ఆధునికత సంతరించుకుంటున్న నేపథ్యంలో.. గ్రామీణ ఫోటోగ్రాఫర్లు ఉనికి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
నూతన సాంకేతికను అందిపుచ్చుకొని, వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటున్నామని తెలిపారు. త్వరలోనే ఫోటోగ్రాఫర్ల సంక్షేమ భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.