పారిశ్రామిక రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణల మూలంగా తెలంగాణ రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలకు స్వర్గధామంగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కులో శ్రీ బయో ఆస్తేటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ అగ్రి బయోటిక్ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం పారిశ్రామిక రంగంలో తీసుకువచ్చిన సింగిల్ విండో మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మూలంగా నూతన పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా మారిందన్నారు. ప్రత్యేకంగా ఆసియాలోని అతి పెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో.. కాలుష్యరహిత పరిశ్రమల కోసం ప్రత్యేకంగా సుల్తాన్పూర్ లో ఏర్పాటు చేసిన మెడికల్ డివైస్ పార్కులో అంతర్జాతీయ పరిశ్రమలు ఏర్పాటు కావడంతో పాటు, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. పారిశ్రామిక రంగానికి కావాల్సిన అన్ని మౌలిక వసతులను ఒకే చోట ప్రభుత్వం కల్పిస్తుండడంతో, నూతన పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
వ్యవసాయ రంగంలో తక్కువ పెట్టుబడితో అత్యధిక దిగుబడి సాధించేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర అందించడంతోపాటు, రైతు బీమా, రైతు బంధు పథకాల ద్వారా వ్యవసాయ తంగం పటిష్టతకు కృషి చేస్తున్నారు అని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గంలో ఒకవైపు పరిశ్రమలు మరోవైపు సాప్ట్వేర్ పరిశ్రమలకు కేంద్రంగా నిలవడం సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్, పరిశ్రమ చైర్మన్ కె ఆర్ కె రెడ్డి, కాకతీయ యూనివర్సిటీ సైన్స్ విభాగం రిటైర్డ్ డీన్ బహదూర్, యోగి వేమన యూనివర్సిటీ మాజీ ఉప కులపతి అర్జున రామచంద్రారెడ్డి, డైరెక్టర్ నిఖిల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.