Saturday, November 23, 2024
HomeతెలంగాణHyd: నూతన పోలీస్ స్టేషన్ భవనాల పనులు మొదలుపెట్టండి

Hyd: నూతన పోలీస్ స్టేషన్ భవనాల పనులు మొదలుపెట్టండి

నూతన పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పోలీసు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి, మహంకాళి, బేగంపేట, గోపాలపురం, సనత్ నగర్, గాంధీ నగర్, ఎస్ఆర్ నగర్ ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని గాంధీ నగర్, గోపాలపురం, బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరైయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి కూడా నిధులు మంజూరై ఉన్నాయని, విశాలమైన భవన నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన స్థలాన్ని స్థలాన్ని వీలైనంత త్వరగా సేకరించి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని హంగులతో కూడిన నూతన పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న అనేక పోలీసు స్టేషన్ భవనాలలో కొన్ని శిధిలావస్థకు చేరి, మరికొన్ని సరైన సౌకర్యాలు లేకపోవడం, మరికొన్ని సౌకర్యవంతంగా లేకపోవడం వలన పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలతో కార్పోరేట్ కార్యాలయాలను తలపించే విధంగా నూతన పోలీసు స్టేషన్ భవనాలను నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పర్యవేక్షణ లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందని వివరించారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్ ల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం గత సంవత్సరం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి 84 లక్షల రూపాయలను అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఇంకా మరికొన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ.కోటి వరకు ఇవ్వనున్నట్లు చెప్పారు. కెమెరాల పనితీరు, నిర్వహణ ను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సిస్ ఆర్, ఫండ్, ధాతలు, కాలనీల అసోసియేషన్ ల భాగస్వామ్యంతో మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని చెప్పారు. ఎంతో చరిత్ర కలిగిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం వచ్చే నెల 20 వ తేదీన నిర్వహించడం జరుగుతుందని, అవసరమైన ఏర్పాట్ల కోసం ఇప్పటి నుండే ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని అన్నారు. జులై 9 వ తేదీన మహంకాళి అమ్మవారి బోనాలు నిర్వహించబడతాయని, ఈ నెలాఖరు లో లేదా వచ్చే నెల ఒదటి వారంలో ఏర్పాట్లపై త్వరలోనే అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం లేదని, అందుకు కృషి చేస్తున్న పోలీసు శాఖ అధికారులను మంత్రి ప్రశంసించారు. ఈ సమావేశంలో ఏసీపీలు పృధ్వీధర్ రావు, రమేష్, సుదీర్, యాదగిరి, మోహన్ కుమార్, ఇన్ స్పెక్టర్ లు శ్రీనివాస్ రావు, కావేటి శ్రీనివాసులు, నాగేశ్వరరావు, లింగేశ్వర్, నేతాజీ, నరేష్, మోహన్ రావు, సైదులు, ముత్తు యాదవ్, పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News