Doctor arrested for selling drugs in Hyderabad : ప్రాణం పోయాల్సిన వైద్యుడే ప్రాణాంతక మత్తుకు బానిసయ్యాడు. రోగులకు చికిత్స అందించాల్సిన చేతులతోనే యువత జీవితాల్లో విషం నింపేందుకు సిద్ధమయ్యాడు. తన ఇంటినే డ్రగ్స్ అడ్డాగా మార్చి, స్నేహితులతో కలిసి మత్తు దందాను యథేచ్ఛగా సాగిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు, ఆ వైద్యుడి గుట్టును రట్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
ఉచిత ‘డోస్’ కోసం.. ఉచ్చులో డాక్టర్ : హైదరాబాద్ ముషీరాబాద్‌కు చెందిన డాక్టర్ జాన్‌పాల్‌కు డ్రగ్స్ తీసుకునే వ్యసనం ఉంది. అయితే, వాటిని కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో, ఓ సులభమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తన స్నేహితులైన ప్రమోద్, సందీప్, శరత్‌లతో కలిసి ఓ పథకం పన్నాడు. ఈ ముగ్గురూ దిల్లీ, బెంగళూరు వంటి నగరాల నుంచి భారీగా ఎండీఎంఏ, ఓజీకుష్, కొకైన్, హాష్‌ఆయిల్ వంటి మత్తు పదార్థాలను నగరానికి తీసుకువచ్చి, వాటిని జాన్‌పాల్ ఇంట్లో నిల్వ చేసేవారు.
అక్కడి నుంచే వినియోగదారులకు విక్రయాలు జరిపేవారు. తన ఇంటిని అడ్డాగా మార్చినందుకు గాను, జాన్‌పాల్‌కు డ్రగ్స్‌ను ఉచితంగా ఇచ్చేవారు. ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF) పోలీసులు, జాన్‌పాల్ నివాసంపై మెరుపుదాడి చేశారు. ఇంట్లో సోదాలు చేసి, సుమారు రూ.3 లక్షల విలువైన వివిధ రకాల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ జాన్‌పాల్‌ను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
నగరంలో విస్తృత దాడులు : మరోవైపు, నగరంలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది.
గచ్చిబౌలిలో భారీ రాకెట్: గచ్చిబౌలి పీఎన్‌జీవో కాలనీలోని ఓ హాస్టల్‌పై దాడి చేసిన పోలీసులు, భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. ఈ కేసులో మొత్తం 19 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి, 11 మందిని అరెస్టు చేశారు. కడపకు చెందిన ఆర్కిటెక్ట్ తేజ కృష్ణ ఈ రాకెట్‌లో కీలక నిందితుడిగా ఉన్నాడు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు గుర్తించారు. ప్రధాన సరఫరాదారుడైన నైజీరియన్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 32 గ్రాముల ఎండీఎంఏ, గంజాయి, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ ఉదయ్ రెడ్డి తెలిపారు.
కేపీహెచ్‌బీలో గంజాయి విక్రేతలు: కేపీహెచ్‌బీలో గంజాయి అమ్ముతున్న ఓ మహిళ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ నుంచి గంజాయి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి 6 కిలోల గంజాయి, 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.


