Elevated corridors from Paradise Junction : హైదరాబాద్ వాహనదారులకు శుభవార్త! నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్యారడైజ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్ పడనుంది. ఈ ప్రాంతం నుంచి రెండు కీలక మార్గాల్లో భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ఈ మెగా ప్రాజెక్టులతో నగర ఉత్తర, తూర్పు ప్రాంతాలకు ప్రయాణం సులభతరం కానుంది. అసలు ఈ కారిడార్లను ఎక్కడ నిర్మించబోతున్నారు..? దీని కోసం ఎదురైన అడ్డంకులను ప్రభుత్వం ఎలా అధిగమించింది..?
హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు, ప్రభుత్వం కీలకమైన రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేసింది.
కారిడార్ 1: ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్ వరకు (రాజీవ్ రహదారి – SH-01పై).
కారిడార్ 2: ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు (NH-44పై).
ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన డిజైన్లు, టెండర్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసి, పనులు ప్రారంభించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
భూసేకరణ అడ్డంకులు దూరం : ఈ కారిడార్ల నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న భూసేకరణ సమస్యను ప్రభుత్వం చాకచక్యంగా పరిష్కరించింది. ఈ ప్రాజెక్టులకు కౌకూర్, శామీర్‌పేట, జవహర్‌నగర్ గ్రామాల పరిధిలో సుమారు 435.08 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరమైంది. ఈ భూమికి బదులుగా (విలువ రూ.1,018.79 కోట్లు), అంతే సమాన విలువైన భూమిని అదే మండలాల్లో రక్షణ శాఖ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ కోసం ప్రభుత్వం కేటాయించింది. ఈ భూముల బదలాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ ఇతర కీలక నిర్ణయాలు : ఈ సమావేశంలో మంత్రిమండలి మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంది.
పోలీసు అమరుల కుటుంబాలకు న్యాయం: 2008లో ఒడిశాలో నక్సల్స్ కాల్పుల్లో మరణించిన 33 మంది పోలీసుల కుటుంబాలకు, గతంలో గాజులరామారంలో కేటాయించిన స్థలానికి బదులుగా, అదే గ్రామంలో మరోచోట 3.10 ఎకరాల భూమిని కేటాయించారు.
గోశాలకు 87 ఎకరాలు: మొయినాబాద్ మండలం, ఎంకేపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన గోశాల కోసం 87 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది.
ఈ కొత్త ఎలివేటెడ్ కారిడార్లు పూర్తయితే, సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట, మేడ్చల్, కొంపల్లి వైపు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరి, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.


