Unscientific battery recycling in Hyderabad: పట్టపగలు ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతాల్లో, రాత్రి 12 గంటలు దాటితే చాలు.. ఓ విషపు భూతం బుసలు కొడుతుంది. నగర శివార్లలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అనధికారిక లెడ్-యాసిడ్ బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్లు, నిబంధనలను నడివీధిలో పాతరేసి, పర్యావరణంపై పంజా విసురుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కళ్లుగప్పి, రాత్రికి రాత్రే తమ కార్యకలాపాలను ముగించేస్తున్న ఈ యూనిట్లు చిమ్ముతున్న విష వ్యర్థాలు భూమిని, నీటిని, గాలిని కబళిస్తున్నాయి. అసలు ఈ అక్రమ దందా వెనుక ఎవరున్నారు? శాస్త్రీయతకు పాతరేసి వీరు అనుసరిస్తున్న ప్రమాదకర పద్ధతులేంటి?
అనుమతుల్లేవ్.. అదుపు లేదు : ఏదైనా పరిశ్రమ స్థాపించాలంటే కాలుష్య నియంత్రణ మండలి నుండి ‘కన్‌సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్’ (CFE), ‘కన్‌సెంట్ ఫర్ ఆపరేషన్’ (CFO) అనుమతులు తప్పనిసరి. కానీ, నగర శివార్లలోని పదుల సంఖ్యలో ఉన్న ఈ బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్లకు అవేమీ లేవు. దీంతో అవి పీసీబీ నిఘా పరిధిలోకి రాకుండా యథేచ్ఛగా తమ పని కానిస్తున్నాయి. శాస్త్రీయ పద్ధతులను గాలికొదిలేసి, అశాస్త్రీయంగా బ్యాటరీలను విడగొట్టడం, కరిగించడం వంటివి చేస్తుండటంతో ప్రమాదకర రసాయనాలు నేరుగా ప్రకృతిలో కలిసిపోతున్నాయి.
రాత్రి 12 నుంచి ఉదయం వరకు.. అంతా గుట్టుచప్పుడు కాకుండా : ఈ యూనిట్ల కార్యకలాపాలన్నీ అత్యంత రహస్యంగా సాగుతాయి. పగటిపూట పనిచేస్తే ఫర్నేస్‌ల నుంచి వచ్చే పొగ, వాసనతో చుట్టుపక్కల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని, రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్యే తమ పనిని పూర్తిచేస్తున్నాయి.
వ్యర్థాల వదిలివేత: బ్యాటరీల నుంచి వెలువడే ప్రమాదకర యాసిడ్ వ్యర్థాలను, ఇతర రసాయనాలను సమీపంలోని చెరువులు, కుంటలు, నాలాల్లోకి వదిలేస్తున్నారు. మరికొన్నింటిని బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్నారు.
గాలి కాలుష్యం: నిబంధనల ప్రకారం ఫర్నేస్‌లకు బ్యాగ్ ఫిల్టర్లు వంటి ‘ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్‌మెంట్’ తప్పనిసరి. కానీ ఈ అక్రమ యూనిట్లలో అవేవీ ఉండవు. ఉన్నా వాటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేస్తారు.
నిబంధనల ఉల్లంఘన: వాస్తవానికి, పాడైన బ్యాటరీలను తయారీదారులు, డీలర్లు ‘ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబులిటీ’ (EPR) కింద తిరిగి సేకరించాలి. హైదరాబాద్‌లో ఈ బాధ్యతను దాదాపు 40 సంస్థలకు అప్పగించారు. కానీ ఆ బ్యాటరీలు ఈ అనధికారిక రీసైక్లింగ్ యూనిట్లకు తరలివెళ్తుండటం ఈ అక్రమ దందా తీవ్రతకు అద్దం పడుతోంది.
READ MORE: https://teluguprabha.net/telangana-news/gm5-psychological-wellness-app-launch-india/
శాస్త్రీయ పద్ధతి ఇది.. వారు చేసేది అది : శాస్త్రీయంగా, పీసీబీ నిబంధనల మేరకు బ్యాటరీలను రీసైకిల్ చేస్తే పర్యావరణానికి హాని కలగదు. ఈ ప్రక్రియలో ముందుగా బ్యాటరీలను పూర్తిగా డిశ్చార్జి చేసి, ముక్కలుగా చేస్తారు. ఆ తర్వాత పైరో-మెటలర్జీ (అధిక ఉష్ణోగ్రతలతో లోహాలను కరిగించడం), హైడ్రో-మెటలర్జీ (రసాయన ద్రావణాలతో లోహాలను వేరుచేయడం) వంటి పద్ధతులతో లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి విలువైన లోహాలను శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. కానీ అక్రమ యూనిట్లలో ఈ ప్రక్రియ ఏదీ పాటించకుండా, కేవలం లోహాన్ని వేరుచేసే క్రమంలో ప్రమాదకర రసాయనాలను యథేచ్ఛగా వాతావరణంలోకి వదిలేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, పర్యావరణానికి తీరని నష్టం చేస్తున్న ఈ అక్రమ రీసైక్లింగ్ యూనిట్లపై అధికారులు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే, భవిష్యత్తు తరాలు తీవ్రమైన ఆరోగ్య, పర్యావరణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.


