Online job fraud : “పార్ట్-టైమ్ జాబ్.. ఇంట్లో నుంచే వేలల్లో సంపాదన!”.. సోషల్ మీడియాలో ఇలాంటి ప్రకటన చూసి ఆశపడుతున్నారా? వాట్సాప్‌కు వచ్చిన అనామక ఆఫర్‌ను నమ్మి మీ వివరాలు పంపుతున్నారా? అయితే మీ కలల కొలువు కల్ల కావచ్చు, మీ ఖాతా ఖాళీ అవ్వొచ్చు! నిరుద్యోగుల ఆశను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. జాబ్ పోర్టల్స్ నుంచే మీ సమాచారాన్ని దొంగిలించి, నిపుణుల్లా ఇంటర్వ్యూలు చేసి, నకిలీ ఆఫర్ లెటర్లతో నిండా ముంచుతున్నారు. 20 నెలల్లోనే 26 వేలకు పైగా కేసులు నమోదయ్యాయంటే ఈ మాయాజాలం ఎంతగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ముఠాలు ఎలా పనిచేస్తాయి? వీరి ఉచ్చులో చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
మోసగాళ్ల మాస్టర్ ప్లాన్ ఇది : నిరుద్యోగుల బలహీనతలే పెట్టుబడిగా సైబర్ నేరగాళ్లు పక్కా ప్రణాళికతో ఈ దోపిడీకి పాల్పడుతున్నారు.
డేటా సేకరణ: ముందుగా జాబ్ పోర్టల్స్, సోషల్ మీడియా నుంచి ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగుల ఈ-మెయిల్, ఫోన్ నంబర్లను సేకరిస్తారు.
నమ్మకం కలిగించడం: ప్రముఖ కంపెనీల ప్రతినిధులమంటూ వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా సంప్రదిస్తారు. నిజమైన నిపుణుల్లా ఆన్‌లైన్‌లో వీడియో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి నమ్మకాన్ని చూరగొంటారు.
చిన్న టాస్క్‌లతో ఎర: కొందరికి ఉద్యోగం ఇచ్చినట్టుగా నమ్మించి, చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తారు. అవి పూర్తి చేసినందుకు 15-20 రోజుల పాటు రోజూ కొంత డబ్బును ఖాతాల్లో జమచేసి, వారిని పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటారు.
అసలు మోసం షురూ: ఇక ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. అదనపు ఆదాయం, కమీషన్ల పేరుతో బంధుమిత్రులను చేర్పించమంటారు. తమ కంపెనీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలొస్తాయని ఆశ చూపిస్తారు.
రిజిస్ట్రేషన్ పేరుతో వసూళ్లు: రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, సెక్యూరిటీ డిపాజిట్ అంటూ రూ.లక్షల్లో వసూలు చేసి, నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చి ముఖం చాటేస్తారు.
నమ్మి నిండా మునిగిన బాధితులు
కేసు 1: చిలకలగూడకు చెందిన ఓ యువకుడు ఇలాగే పార్ట్-టైమ్ జాబ్ ప్రకటన చూసి సంప్రదించాడు. వీడియో ఇంటర్వ్యూ తర్వాత రిజిస్ట్రేషన్ పేరుతో రూ.1.50 లక్షలు కట్టించుకుని, బెంగళూరు ఐటీ కంపెనీ పేరుతో నకిలీ ఆఫర్ లెటర్ చేతిలో పెట్టారు. అక్కడికి వెళ్లాకే తాను మోసపోయానని గ్రహించాడు.
కేసు 2: బహదూర్‌పురకు చెందిన ఓ వ్యాపారికి న్యూజిలాండ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. విదేశాంగ ప్రతినిధి పేరుతో ఇంటర్వ్యూ చేసి, వీసా ప్రాసెసింగ్ కోసం పలు దఫాలుగా రూ.5 లక్షలు వసూలు చేసి ఉడాయించారు. ఇటీవల హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన 61 మంది సైబర్ నేరగాళ్లలో 25 మంది ఇలా ఉద్యోగాల పేరుతో మోసం చేసేవారే కావడం గమనార్హం.
“ఏ కంపెనీ కూడా ఉద్యోగం ఇచ్చే ముందు డబ్బులు అడగదు. ఈ ప్రాథమిక విషయాన్ని నిరుద్యోగులు గుర్తుంచుకోవాలి. రిజిస్ట్రేషన్, డిపాజిట్ ఫీజుల పేరుతో డబ్బు అడిగితే అది కచ్చితంగా మోసమే. అనుమానం వస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలి.”
– కవిత, సైబర్‌క్రైమ్ డీసీపీ
తల్లిదండ్రులకు భారం కాకూడదనే తాపత్రయంతో ఉన్న యువత, ఈజీ మనీ కోసం ఆశపడితే సైబర్ వలలో చిక్కుకోవడం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తతే ఈ మోసాలకు ఏకైక విరుగుడు.


