Weather Updates In Telangana: రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కూడా పడవచ్చన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు కూడా రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయన్నారు.
నేడు ఈ ప్రాంతాల్లో:
ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.ఇక హైదరాబాద్ లో కూడా పగటిపూట ముసురు వాతావరణం, రాత్రి తేలికపాటి వర్షం ఉండవచ్చు.
గడిచిన 24 గంటల్లో:
నిన్న రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది, ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా కామారెడ్డి లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కామారెడ్డి బైపాస్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిర్మల్ జిల్లాలో, ముఖ్యంగా ముధోల్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ సహా యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, ఖమ్మం వంటి జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసాయి.
ప్రజలు అకస్మాత్తుగా వాతావరణంలో వచ్చే మార్పుల పట్ల, ముఖ్యంగా భారీ వర్షపాతం హెచ్చరికలు జారీ చేయబడిన జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


