Saturday, November 15, 2025
HomeతెలంగాణPod Hotels in Hyderabad : భాగ్యనగరంలో 'పాడ్'ల సందడి... రూ.500కే హాయిగా...

Pod Hotels in Hyderabad : భాగ్యనగరంలో ‘పాడ్’ల సందడి… రూ.500కే హాయిగా నిద్రపోండి!

Affordable pod hotels in Hyderabad : రాత్రిపూట కొత్త ఊరు, రైలో విమానమో ఆలస్యం… ఆ సమయంలో తలదాచుకోవడానికి ఓ గది దొరక్క ప్లాట్‌ఫారంపైనే జాగారం చేసిన అనుభవాలు చాలామందికి ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల వద్ద తక్కువ ధరలో, సురక్షితమైన వసతి దొరకడం గగనమే. అయితే, ఇప్పుడు ఆ చింత అక్కర్లేదు. భాగ్యనగరం ప్రయాణికులకు ఓ సరికొత్త ఊరటనిస్తోంది. అదే, పాడ్ స్లీపింగ్ రూమ్! జపాన్‌లో పుట్టిన ఈ సరికొత్త బస ట్రెండ్, ఇప్పుడు హైదరాబాద్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. ఇంతకీ ఏమిటీ పాడ్ రూమ్‌లు…? వీటి ప్రత్యేకతలేంటి..? ప్రయాణికులకు ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి..? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

ప్రయాణికులకు పాకెట్-ఫ్రెండ్లీ ఊరట : పర్యాటకులు, ఉద్యోగులు, విద్యార్థుల రాకపోకలతో హైదరాబాద్ నగరం నిత్యం రద్దీగా ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, ముఖ్యంగా రాత్రి వేళల్లో నగరాన్ని చేరుకున్నప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగానే “పాడ్ స్లీపింగ్ రూమ్” కల్చర్ ప్రాచుర్యం పొందుతోంది. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో సేదతీరాలనుకునే వారికి ఇవి వరంలా మారాయి. ఇప్పటికే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA), కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులను ఆకట్టుకుంటున్న ఈ పాడ్ రూమ్‌లు, తాజాగా బేగంపేట వంటి ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి.

పాడ్ రూమ్‌లలో లభించే సౌకర్యాలు: ఈ స్లీపింగ్ పాడ్‌లు చిన్నవిగా కనిపించినా, అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికుల బడలికను ఇట్టే తీర్చేస్తాయి. వీటిని ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

వ్యక్తిగత సౌకర్యాలు: ప్రతి పాడ్‌లోనూ ఏసీ, రీడింగ్ లైట్, మొబైల్/ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పోర్ట్‌లు ఉంటాయి.

ప్రశాంతమైన నిద్ర: బయటి శబ్దాలు వినిపించకుండా సౌండ్ ప్రూఫ్ డిజైన్‌తో వీటిని రూపొందించారు.

భద్రత – ప్రైవసీ: మహిళలు, కుటుంబాలు, వికలాంగులు, ఒంటరి ప్రయాణికుల కోసం వేర్వేరు విభాగాలను కేటాయిస్తారు. మీ వస్తువులను భద్రపరుచుకోవడానికి ప్రత్యేక లాకర్లు కూడా ఉంటాయి.

అదనపు సదుపాయాలు: ఉచిత వై-ఫై, శుభ్రమైన బెడ్ షీట్లు, దుప్పట్లు, షేర్డ్ వాష్‌రూమ్‌లు వంటి అన్ని సౌకర్యాలూ కల్పిస్తారు.

సులభమైన బుకింగ్: గంటల చొప్పున ఆన్‌లైన్‌లోనే సులువుగా బుక్ చేసుకోవచ్చు. ధరలు గంటకు సుమారు రూ. 500 నుంచి ప్రారంభమై, మూడు గంటలకు రూ. 1400 వరకు ఉన్నాయి.

1979లో జపాన్‌లో కిషో కురొకవా అనే ఆర్కిటెక్ట్ రూపొందించిన ఈ క్యాప్సూల్ హోటల్ ఆలోచన, నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికులకు తక్కువ ఖర్చులో నాణ్యమైన వసతిని అందిస్తోంది. హైదరాబాద్‌లో కూడా ఈ ట్రెండ్‌కు ఆదరణ పెరుగుతుండటంతో, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటివి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad