Sunday, November 16, 2025
HomeతెలంగాణCyber Fraud : ఆశల స్టాక్.. ఖాతా ఖతం! సైబర్ వలలో వెయ్యి కోట్ల విలవిల!

Cyber Fraud : ఆశల స్టాక్.. ఖాతా ఖతం! సైబర్ వలలో వెయ్యి కోట్ల విలవిల!

Online investment fraud : “లక్ష పెట్టుబడి పెట్టండి.. పది లక్షల లాభం తీసుకోండి!”.. ఆన్‌లైన్‌లో ఇలాంటి ప్రకటన చూసి ఆశపడుతున్నారా? ఎవరో అపరిచితులు వాట్సాప్‌లో చెప్పిన మాటలు నమ్మి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడుతున్నారా? అయితే మీ ఖాతా ఖాళీ అయినట్టే, తస్మాత్ జాగ్రత్త! అత్యాశే పెట్టుబడిగా సైబర్ నేరగాళ్లు రాష్ట్రంలో పన్నిన మాయావ్యూహంలో అమాయకులు చిక్కుకుంటున్నారు. కేవలం ఈ ఏడాది 8 నెలల్లోనే ఏకంగా రూ.372 కోట్లు ప్రజల నుంచి కొల్లగొట్టారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గత ఏడాదితో కలిపి కేవలం 20 నెలల్లో మోసపోయిన సొమ్ము సుమారు వెయ్యి కోట్లకు చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అసలు ఎలా జరుగుతోంది ఈ భారీ మోసం..? అమాయకులను ఎలా బుట్టలో వేస్తున్నారు..? దీని నుంచి బయటపడే మార్గమేంటి..?

- Advertisement -

మోసగాళ్ల మాయావ్యూహం ఇలా : విద్యాధికులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. పక్కా ప్రణాళికతో, దశలవారీగా తమ ఉచ్చు బిగిస్తున్నారు.
ఎర వేయడం: ముందుగా గుర్తుతెలియని వ్యక్తులు మిమ్మల్ని వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్పిస్తారు. “స్టాక్ మార్కెట్ సలహాలు”, “భారీ లాభాలు” అంటూ పోస్టులతో ఊరిస్తారు.
నమ్మకం కలిగించడం: గ్రూపులోని సభ్యులందరూ (వారంతా నేరగాళ్ల మనుషులే) తాము లక్షలు సంపాదించామంటూ నకిలీ స్క్రీన్‌షాట్లు పెడతారు. మీరు స్పందించగానే, చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టించి, దానికి రెండు, మూడు రెట్లు లాభం వచ్చినట్లు చూపిస్తారు. ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశమిచ్చి పూర్తి నమ్మకాన్ని పొందుతారు.

భారీ దోపిడీ: చిన్న లాభానికి ఆశపడిన బాధితులు, ఇక వారిని గుడ్డిగా నమ్మేస్తారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే కోట్లలో లాభం వస్తుందని నమ్మిస్తారు. బాధితులు రూ.లక్షలు, కోట్లు బదిలీ చేయగానే నకిలీ యాప్‌లో లాభం అంకెలు కనిపిస్తాయి తప్ప, ఒక్క రూపాయి కూడా విత్‌డ్రా కాదు.

అదృశ్యం: డబ్బు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించగానే వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అవుతాయి, వాట్సాప్ గ్రూపులు అదృశ్యమవుతాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

కోట్లు వచ్చాయని చూపించి… ఆపై టోకరా!
కేసు 1: హైదరాబాద్‌కు చెందిన 61 ఏళ్ల విశ్రాంత ఉద్యోగిని ఇలాగే వాట్సాప్ గ్రూపులో చేర్చారు. రూ.50 వేల పెట్టుబడికి మూడు రెట్లు లాభం రావడంతో నమ్మేశారు. దశలవారీగా రూ.6.80 కోట్లు పెట్టుబడి పెట్టగా, యాప్‌లో రూ.14 కోట్ల లాభం చూపించింది. ఆశపడిన ఆయన, డబ్బు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించగా మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.

కేసు 2: ప్రగతినగర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ “ప్రొఫెసర్ అనురాగ్ శర్మ” అనే వ్యక్తి మాటలు నమ్మి, నకిలీ యాప్‌లో రూ.2.40 కోట్లు బదిలీ చేశారు. యాప్‌లో రూ.10 కోట్ల లాభం కనిపిస్తున్నా, విత్‌డ్రా కాకపోవడంతో లబోదిబోమన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad