Sunday, October 20, 2024
HomeతెలంగాణHyderabad to be a 600$ Billion Economy: 600 బిలియన్ డాలర్ల సిటీగా...

Hyderabad to be a 600$ Billion Economy: 600 బిలియన్ డాలర్ల సిటీగా హైదరాబాద్: సీఎం రేవంత్

లీడర్షిప్ సమ్మిట్ లో..

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగిన ‘లీడర్షిప్ ఇన్ న్యూ ఇండియా’ అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.  ముఖ్యమంత్రిగా, సీనియర్ రాజకీయ నేతగా ఆయన తన ఆలోచనలను ఐ.ఎస్.బి. విద్యార్థులతో పంచుకున్న తీరు ఆద్యంతం అందరినీ ఆకట్టుకుని, ఆలోచింపచేయటం విశేషం.

- Advertisement -

అదృష్టం కూడా అవసరం..

ఎంతటి గొప్ప నాయకుడికైనా ధైర్యం చాలా ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.   తెలివితేటలు, నైపుణ్యం, కష్టపడి పనిచేయడంతో పాటు  కొన్నిసార్లు అదృష్టం కూడా అవసరమన్న ముఖ్యమంత్రి రేవంత్, గొప్ప పనులు చేయడానికి  రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుండా కొన్ని సాధించలేమన్నారు.   గొప్ప నాయకులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారని, మన పోరాటంలో మనం చాలా కోల్పోవచ్చని, దేశంలోని గొప్ప నాయకులు, మన కాంగ్రెస్ నాయకులు, ప్రజల కోసం తమ వృత్తిని, డబ్బును, సుఖాలను, స్వేచ్ఛతో పాటు  వారి జీవితాన్ని కూడా త్యాగం చేశారంటూ గుర్తుచేశారు.

ధైర్యం, త్యాగంతోనే..

ధైర్యం, త్యాగం రెండు ఉంటేనే మంచి నాయకుడిగా ఎదగగలరని ఈ రెండు విలువల గురించి ఆలోచించాలని ఐ.ఎస్.బి. విద్యార్థులకు సలహా ఇచ్చారు సీఎం రేవంత్.   ధైర్యం ఉండి, త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటే విజయం సాధిస్తారని ఆయన పేర్కొనటం విశేషం. 

ప్రజలతో నిత్యం నేరుగా సంబంధాలు..

ప్రజలతో నిత్యం నేరుగా సంబంధాలు నెరపాల్సిందేనన్న సీఎం ఇందుకు పేదలు, ధనికులు ,చిన్నా, పెద్దా అన్న భేదం లేకుండా సమాన గౌరవం ఇస్తూ అందరినీ స్నేహ భావంతో కలుపుకుపోవాలన్నారు.  ప్రజలతో నిత్యం సంబంధాలు పెట్టుకుంటే ఏదైనా సాధించగలమని,  ఐ.ఎస్.బి. విద్యార్థులంతా హైదరాబాద్, తెలంగాణతో పాటు న్యూ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌లన్నారు.

ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం..

తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల జిడిపి ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే సర్కారు లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్‌ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాలన్నారు.  

తెలంగాణను ప్రపంచంలోని ప్రతి భాగానికి తీసుకెళ్లడానికి నాకు మీ సాయం కావాలన్న సీఎం, మీరు ఎక్కడికి వెళ్లినా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు , సామాన్య ప్రజలతో తెలంగాణ ,హైదరాబాద్ గురించి మాట్లాడాలని హితవు పలికారు. 

విదేశాలతోనే పోటీ..

 భారతదేశంలోని ఇతర నగరాలతో హైదరాబాద్  పోటీపడాలని తాను కోరుకోవడం లేదన్న ముఖ్యమంత్రి న్యూయార్క్, లండన్, పారిస్, టోక్యో, సియోల్‌ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీపడాలని  కోరుకుంటున్నట్టు తన మనసులోని మాటను వెల్లడించారు.   ప్రపంచంలోనే  భారతదేశం, హైదరాబాద్ అత్యుత్తమంగా మారాలన్నది పెద్ద లక్ష్యమని, ఇదేం అసాధ్యం కాదని విశ్వాసం వ్యక్తంచేశారు.  ఇండియన్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు ప్రభుత్వంతో రెండు మూడేళ్లు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.  అయితే వీరందరికీ పెద్ద జీతాలు ఇవ్వలేకపోయినా మంచి అవకాశాలు, పెద్ద సవాళ్ళను ఇస్తానని సీఎం భరోసా ఇవ్వటం హైలైట్.

ఒలింపిక్స్ లో పతకమే లక్ష్యం..

 రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించిన సీఎం రేవంత్ తాను సౌత్ కొరియా లో స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించినట్టు వివరించారు.  సౌత్ కొరియా లాంటి చిన్న దేశం ఒలింపిక్స్ లో అనేక పతకాలు సాధించగా, మన దేశం ఒలింపిక్స్ లో ఒక్క బంగారు పతకం కూడా  సాధించలేకపోయిందన్నారు.  తన లక్ష్యం ఒలింపిక్స్ పతకాలు సాధించటమేనన్నారు.  హైదరాబాద్ ను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే సీఎంగా తన ఆలోచన అంటూ రేవంత్ ప్రసంగం సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News