హైడ్రా (HYDRAA) అంటేనే హడలెత్తిన మహానగరంలోని చెరువులు, కుంటల ఆక్రమిత స్థలాల్లో ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్న వారికి హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పారు. చెరువులు, కుంటల ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఇండ్లు ఉన్నా, వాటికి సంబంధిత శాఖల నుంచి పర్మిషన్లుంటే, వాటిని కూల్చబోమని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక నుంచి ఎఫ్ టీఎల్ లో నిర్మాణాలు రాకుండా చూసుకుంటామని తెలిపారు. శుక్రవారం చెరువులు, కుంటల ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల గుర్తించే వియషయంపై రిటైర్డు ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, వాతావరణ నిపుణులు, అన్ని శాఖల మేధావులతో బుద్దభవన్ లో హైడ్రా (HYDRAA) సమావేశాన్ని నిర్వహించింది.
ఎఫ్ టీఎల్ ఎలా నిర్దారించాలి, చెరువుల సమస్యల పైన విస్తృతంగా చర్చించారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, నాలాల పునరుద్ధరణ అంశాలపై రిటైర్డు ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, వాతావరణ నిపుణుల అభిప్రాయాలను హైడ్రా సేకరించింది. చెరువుల ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై పలువురు రిటైర్డు ఇంజనీర్లు, ప్రొఫెసర్లు తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు కమిషనర్ తెలిపారు.ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, నిపుణులు, వాతావరణ నిపుణుల అభిప్రాయాలను, చర్చించిన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ వివరించారు.
బెంగుళూరు లో చెరువుల పరిరక్షణ బాగుందని, అక్కడ పర్యటించి అధ్యయనం చేశామని, చెరువుల పునరుద్దరణకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని ఆయన వెల్లడించారు. సర్వే ఆఫ్ ఇండియా, అలుగు హైట్, విలేజ్ మ్యాప్, లేక్ స్ప్రెడ్ డేటా లను పరిగణనలోకి తీసుకుని చెరువుల ఎఫ్ టీఎల్ ను ఫిక్స్ చేస్తామని వెల్లడించారు. శిఖం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని, బతుకమ్మ కుంట లో ప్రస్తుతం మిగిలిన ల్యాండ్ లోనే చెరువును పునరుద్దరిస్తామని, ఇదే విషయానికి సంబంధించి కొందరు కోర్టుకు వెళ్లి స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చారని తెలిపారు. తాముకూడా కోర్టు లో కౌంటర్ వేసి, ఆర్డర్ వెకేట్ చేయించి, త్వరలో చెరువును పునరుద్ధరిస్తామని కమిషనర్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.