Nara Chandrababu Naidu: తాను అధికారం కాదని, అభిమానాన్ని కోరుకుంటానని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బుధవారం సాయంత్రం ఖమ్మంలో తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘టీడీపీ విజయ శంఖారావం’ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన అశేష జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
సభకు హాజరైన టీడీపీ అభిమానుల్ని చూస్తుంటే ఉత్సాహంగా ఉందన్నారు. ‘‘టీడీపీ రుణం తీర్చుకునేందుకు యువత ఈ సభకు భారీగా తరలివచ్చింది. ఈ సభకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. నేను కోరుకునేది అధికారం కాదు.. మీ అభిమానం. తెలుగువారు ఎక్కడున్నా వారి అభిమానమే కోరుకుంటా. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఇప్పుడు చూస్తున్నా. తెలంగాణలో టీడీపీ ఎక్కడా అనే వారికి ఈ రోజు ఖమ్మంలో తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తున్న ఉత్సాహమే సమాధానం. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టారు.
టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని, భవిష్యత్తుకు నాంది పలకబోతుంది. హైదరాబాద్‌లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి ఐకానిక్ సింబల్ ఉండేలా హైటెక్ సిటీ నిర్మించా. తెలంగాణలో పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్ రద్దు చేశారు. ఎన్టీఆర్ ఒక శక్తి. ఒక వ్యవస్థ. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా ఉంటారు. టీనేజర్లలా ఆలోచిస్తూ అన్ని విషయాల్లో ముందుంటా. శాశ్వతంగా తెలుగువారి బంధువుగా ఉండాలని పని చేస్తున్నా. రాబోయే 30 ఏళ్లలో ఏం జరగబోతుందో ఊహించి సిద్ధం చేయగలను.
హైదరాబాద్ అభివృద్ధికి ఫౌండేషన్ వేశాం. మళ్లీ రెండు రాష్ట్రాలను కలిపేస్తామంటూ మాట్లాడుతున్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లెవరూ ఇలా మాట్లాడరు. తెలుగు ప్రజలు ఇచ్చిన అవకాశాలతో తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశాను. నాలాగా అన్నేళ్లు ఉమ్మడి ఏపీని పాలించిన వాళ్లెవరూ లేరు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.