Government driver training program : హెవీ మోటార్ వెహికిల్ (HMV) లైసెన్సు ఉండి కూడా సరైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ప్రభుత్వ డ్రైవర్‌గా స్థిరపడాలన్నది మీ కలా? అయితే, ఆ కలను నిజం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ సువర్ణావకాశం కల్పిస్తున్నాయి. డ్రైవర్ ఉద్యోగాలకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలను అందించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని ఐడీటీఆర్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్, స్కిల్స్) సిద్ధమైంది. ఇంతకీ ఈ శిక్షణ ఎక్కడ ఇస్తున్నారు? దీనికి అర్హతలేంటి? ఈ శిక్షణతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి..?
ఉద్యోగాల జాతర.. అర్హతలు ఇవే : ఇటీవల వివిధ ప్రభుత్వ శాఖల్లో డ్రైవర్ పోస్టుల భర్తీకి భారీగా నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
మొత్తం ఖాళీలు: రాష్ట్ర రవాణా, పోలీసు, సీఐఎస్ఎఫ్, దిల్లీ పోలీసు విభాగాల్లో కలిపి మొత్తం 3,604 డ్రైవర్ పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి లేదా ఐటీఐ పూర్తి చేసి, హెచ్‌ఎంవీ లైసెన్సు కలిగి ఉండాలి.
అయితే, లైసెన్సు ఉన్నంత మాత్రాన ఉద్యోగం రాదు. ప్రభుత్వ నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించే డ్రైవింగ్ టెస్టులో నైపుణ్యాన్ని ప్రదర్శించడం తప్పనిసరి. ఇక్కడే చాలా మంది అభ్యర్థులు వెనుకబడుతున్నారు. ఈ లోటును భర్తీ చేయడానికే ఐడీటీఆర్ ప్రత్యేక రిఫ్రెష్‌మెంట్ శిక్షణను అందిస్తోంది.
పది రోజుల శిక్షణ.. పక్కా నైపుణ్యం : ప్రభుత్వ సహకారంతో నడిచే ఈ సంస్థ, ఉద్యోగార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించింది.
శిక్షణా కేంద్రం: రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లిలోని ఐడీటీఆర్.
వ్యవధి: పది రోజుల పాటు శిక్షణ ఉంటుంది.
బ్యాచ్: ఒక్కో బృందంలో 30 మందికి శిక్షణ ఇస్తారు.
శిక్షణలో ముఖ్యాంశాలు: డ్రైవింగ్ టెస్టులో అత్యంత కీలకమైన ‘8’, ‘H’ ఆకారాల్లో వాహనాన్ని నడపడంలో ప్రత్యేక మెలకువలు నేర్పిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు, వృత్తికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తారు.
అత్యవసర మరమ్మతులు: సెంట్రల్ మోటార్ వెహికిల్ నిబంధనల (CMVR) ప్రకారం, వాహనం మధ్యలో ఆగిపోతే చేయాల్సిన తక్షణ మరమ్మతులపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు.
సౌకర్యాలు.. రుసుములు : శిక్షణకు వచ్చే వారి కోసం ఐడీటీఆర్‌లో 180 మందికి సరిపడా వసతి గృహం అందుబాటులో ఉంది.
శిక్షణ రుసుము: రూ.7,500
వసతితో కలిపి: రూ.10,500
ధ్రువీకరణ పత్రం: శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ గుర్తింపు పొందిన ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తామని ఐడీటీఆర్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ దురై మురుగన్ తెలిపారు. ఈ సర్టిఫికెట్ ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
నమోదు చేసుకోవడానికి ఆసక్తి గల అభ్యర్థులు ఐడీటీఆర్ అధికారిక వెబ్‌సైట్‌లో గానీ, నేరుగా కార్యాలయానికి వచ్చి గానీ తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. పెద్దగా చదువుకోకపోయినా, హెవీ లైసెన్సుతో ప్రభుత్వ కొలువు సాధించాలనుకునే యువతకు ఇది ఒక గొప్ప అవకాశం.


