Illegal sale of abortion pills : ప్రాణం పోయాల్సిన మందులే పసికందుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. వైద్యుడి చీటీ లేకుండానే యథేచ్ఛగా అమ్ముడవుతూ, కడుపులోనే చిన్నారుల కథను కంచికే చేర్చుతున్నాయి. నల్గొండ జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ అక్రమ దందా వెనుక ఉన్నది ఎవరు..? చట్టానికి చిక్కకుండా ఈ వ్యవహారం ఎలా సాగుతోంది..? అధికారుల పర్యవేక్షణ ఏమైంది…? పూర్తి వివరాలు మీకోసం!
ప్రజల ప్రాణాలతో చెలగాటం : నల్గొండ జిల్లాలో గర్భస్రావం ఒక అక్రమ పరిశ్రమగా మారుతోందనడానికి స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. చట్టాలను కాలరాస్తూ, మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఈ దందా కొనసాగుతోంది.
మామూళ్ల మత్తులో అధికారులు : జిల్లాలోని అనేక ఔషధ దుకాణాల్లో గర్భస్రావం మాత్రలు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే లభిస్తున్నాయి. కొందరు ఆర్‌ఎంపీలు డబ్బుకు ఆశపడి, గర్భిణి నెలలను బట్టి రేటు కట్టి ఈ మాత్రలను అమ్ముతున్నారు. మరికొందరు తెలివిగా ప్రైవేటు నర్సింగ్ హోంలకు పంపి కమీషన్లు దండుకుంటున్నారు. ఈ అక్రమ దందాను అరికట్టాల్సిన అధికారులు నెలవారీ మామూళ్లకు అలవాటుపడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇలాంటి వ్యవహారాలు నడిపే నర్సింగ్ హోంలు వందకు పైగా ఉన్నాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
గాలికి వదిలేసిన చట్టాలు: లింగ నిర్ధారణను నిషేధించే పీసీ పీఎన్‌డీటీ చట్టం, కేవలం వైద్యుల పర్యవేక్షణలో, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే గర్భస్రావానికి అనుమతించే ఎంటీపీ చట్టం జిల్లాలో పూర్తిగా నీరుగారిపోయాయి. ఈ చట్టాల ఉల్లంఘనలపై అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడమే ఈ అక్రమాలకు ప్రధాన కారణం.
అధికారుల చర్యల్లో నిర్లక్ష్యం.. నేరస్తులకు అభయం: అక్రమ గర్భస్రావం వికటించి ఈ ఏడాది మే 24న మోతె మండలానికి చెందిన అనుష అనే మహిళ మృతి చెందిన ఘటనలో ఇప్పటికీ నిందితులందరినీ అరెస్టు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. అలాగే, జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ చేస్తూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను కేవలం స్టేషన్ బెయిల్పై వదిలేయడం వల్ల నేరస్తులకు చట్టాలంటే భయం లేకుండా పోతోంది. ఇలాంటి వారిపై పీడీ యాక్ట్ వంటి కఠినమైన చట్టాలు ప్రయోగిస్తేనే ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
“వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా గర్భస్రావం టాబ్లెట్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా తనిఖీలు చేస్తున్నాం. ఇటీవల నిబంధనలు ఉల్లంఘించిన రెండు మెడికల్ షాపులను సస్పెండ్ చేశాం. మరోసారి తప్పు చేస్తే లైసెన్సు రద్దు చేస్తాం.”
– సురేందర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, సూర్యాపేట


