ఆర్టీసీ ఫుల్-ఆటో నిల్, ఇదేమీ ఖర్మరా మాకు.. అంటూ ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తుండటంతో ఆటోవాలాలు ఉపాధి కోల్పోయారు. ప్రధానంగా గార్ల మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్ మర్రిగూడెం ఆటో అడ్డా, పోచారం ఆటో అడ్డాలోని ఆటో డ్రైవర్లకు ప్రయాణికులు లేకపోవడంతో ఖాళీగానే కాలం గడుపుతున్నారు. మహిళలంతా బస్సుల్లోనే ప్రయాణించడానికి మొగ్గు చూపుతుండడంతో సీతంపేట డోర్నకల్ సత్యనారాయణపురం పోచారం పిన్ రెడ్డిగూడెం తదితర ప్రాంతాలకు వెళ్లే గిరాకీ దొరకక పూట గడవని పరిస్థితి నెలకొందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమరవీరుల స్తూపం ఆటో అడ్డాలో ఆటోలున్నా మహిళలు పురుషులు ఆర్టీసీ బస్సులో ఎక్కారు బస్సు ఎక్కుతున్న మహిళలను చూస్తున్న ఆటోడ్రైవర్లు ఇదేమి ఖర్మరా మాకు అంటూ బిక్క మొహం వేసుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆటో డ్రైవర్ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మా బతుకు చక్రం తిరగబడుతుందని ఆటోలకు గిరాకీ రావడం లేదని ఆటో ప్రయాణాలు చేసే వారు కరువవడంతో ఎంతో కొంత గిరాకీలోనే సీరియల్ ప్రకారం వెళ్తూ వచ్చిన కొంత డబ్బులపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న ఆటో వాళ్లకు పూట గడవడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటో తోలి సంపాదించిన వాటితోనే జీవనం సాగిస్తూ అటు ఇంటి కిరాయి కట్టలేక పిల్లల చదువులు బండి మెయింటెనెన్స్ కు డబ్బులు లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని, కిరాయి ఆటో నడిపే డ్రైవర్లు ఆటోలు నడపలేక కూలి పనులకు వెళ్తున్నారని తెలిపారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు.