తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షురాలు ఇందిరా శోభన్ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేటీఆర్ ఇలాకాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్ మరణం పై ఆయనే సమాధానం చెప్పాలని ఇందిరా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి పై మాట్లాడిన ఆమె.. టీఎస్పిఎస్ సిలో జరిగిన అక్రమాల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. ప్రభుత్వం పూర్తిగా ప్రజలను మోసం చేస్తోందన్నారు. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులను కూడా మోసం చేస్తుందని అన్నారు.
టీఎస్పీఎస్సీ లో జరిగిన అక్రమాలపై కేటీఆర్ వ్యంగంగా మాట్లాడడం సరైనది కాదని అన్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారమే మూడు లక్షల ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వమే చెబుతుందన్నారు.
టీఎస్పీఎస్సీలో జరిగిన జరిగిన అక్రమాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది వస్తే ఎవరికి చెప్పాలో అర్థం కాక చివరకు గవర్నర్ కి చెప్పుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు చేస్తామంటే వారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.