రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన అన్ని రకాల వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ రూ. 500 చెల్లించాలని జడ్చర్ల బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు క్వింటాలకు రూ. 500 బోనస్ ఇవ్వాలని, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశానుసారం బిఆర్ఎస్ నాయకులు జడ్చర్ల తాహసిల్దార్ కార్యాలయం ఎదురుగా నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం తాహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తున్నారని, సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం తెలంగాణ రైతులను ప్రభుత్వం మరోసారి మోసం చేయడమేనని అన్నారు. రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వాలని అన్నారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, పిఎసిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, నాయకులు రామ్మోహన్, వీరేష్, శ్రీకాంత్, నర్సింలు, కృష్ణారెడ్డి, శంకర్ నాయక్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.