Sunday, December 8, 2024
HomeతెలంగాణJadcharla: పేద ప్రైవేట్ టీచర్లకు డబుల్ బెడ్రూం ఇండ్లు

Jadcharla: పేద ప్రైవేట్ టీచర్లకు డబుల్ బెడ్రూం ఇండ్లు

ప్రైవేట్ స్కూళ్లు బంద్ లకు మద్దతివ్వొద్దు

ప్రైవేటు పాఠశాలల్లో చాలీచాలని జీతాలతో బతుకుతున్న పేద టీచర్లకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఇప్పించడానికి కృషి చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీలు బంద్ లకు పిలుపునిచ్చినప్పుడు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు బంద్ కు మద్దతిస్తూ తమ స్కూళ్లను బంద్ చేయడం మానుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్చర్ల కేంద్రంలోనీ చంద్ర గార్డెన్లో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి జనంపల్లి అనిరుధ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా జడ్చర్ల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ తన దృష్టిలో విద్య అనేది లాభాపేక్ష లేని రంగమని, తాను విద్యాభివృద్ధి కార్యక్రమాలకే తొలి ప్రాధాన్యత ఇస్తానని, జడ్చర్ల నియోజకవర్గంలోని విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రైవేటు టీచర్లకు చాలినంత వేతనాలు ఉండవని ఈ కారణంగా వారు అనేక ఇబ్బందులు పడుతుంటారని, ఈ కారణంగానే ఇంకా అనేక మంది టీచర్లు పేదరికంలోనే ఉన్నారనే విషయం తనకు తెలుసున్నారు. ఇలాంటి వారందరినీ దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం కృత్రిమ మేధ సాయంతో పని చేసే రేషన్ కార్డు, హెల్త్ కార్డులను కూడా జారీ చేయబోతోందని తెలిపారు. ప్రభుత్వ టీచర్లయినా, ప్రైవేటు టీచర్లయినా పిల్లల భవిష్యత్తు పూర్తిగా వారి మీదనే ఆధారపడి ఉంటుందని, టీచర్లు చూపిన బాటలోనే పిల్లలు తమ భవిష్యత్తును మల్చుకుంటారని అభిప్రాయపడ్డారు. అందుకే టీచర్లు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో కూడా స్థానికులే టీచర్లుగా ఉంటారని, అక్కడ కూడా అవే పాఠాలు, అవే పరీక్షలు ఉంటాయని తల్లిదండ్రులు తెలుసుకోవాలని, కార్పొరేట్ హంగులు చూసి మోసపోయి ఫీజులను చెల్లించడానికి ఆస్తులను అమ్ముకోవాలన్న ఆలోచనలకు స్వస్తి పలకాలని హితవు చెప్పారు. ఏ పాఠశాలలో బాగా పాఠాలు చెబుతారో తెలుసుకొని ఆ పాఠశాలలో తమ పిల్లలను చేర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

జడ్చర్లలో ఇళ్లు లేని నిరుపేదలు ఇంటి కోసం దరఖాస్తులు పెట్టుకుంటే వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పించడానికి కృషి చేస్తానని అనిరుధ్ హామీ ఇచ్చారు. లక్ష, రెండు లక్షలు ఇస్తే డబుల్ బెడ్రూం ఇల్లు వస్తుందన్న ప్రచారాన్ని నమ్మకూడదని, డబుల్ బెడ్రూం ఇంటి కోసం ఎవరికీ ఒక్క రుపాయికి కూడా ఇవ్వకూడదని స్పష్టం చేసారు. రికగ్నైజ్డ్ స్కూళ్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షలు అయూబ్, కార్యదర్శి నరేష్, కోశాధికారి గోవర్ధన్, కాంగ్రెస్ నాయకులు శివకుమార్, అశోక్ యాదవ్, నిత్యానందం, బుక్కా వెంకటేశం, మినాజుద్దీన్, బి.వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News