విధులకు గైర్హాజరై విధుల్లో నుండి తొలగించ బడిన ఆర్టిజన్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు. వాస్తవానికి ఔట్ సోర్సింగ్ పేరుతో విధులు నిర్వర్తిస్తున్న ఆర్టిజన్లను దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఅర్ మానవతా దృక్పథంతో క్రమబద్దీకరించిన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అదే మానవీయ కోణంలోనే 196 మంది ఆర్టీజన్ లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.సమ్మె పేరుతో విధులకు గైర్ హాజరైన 196 మంది ఆర్టీజన్లను విధుల్లో నుండి శాశ్వతంగా తొలగిస్తూ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దీనితో ఆర్టిజన్ల సంఘాల తరఫున మలక్ పేట శాసనసభ్యులు అహ్మద్ అబ్దుల్లా బలాల ఆద్వర్యంలో ఆర్టిజన్ సంఘాల ప్రతినిధులు మంగళవారం ఉదయం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ట్రాన్స్కో & జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు,టి యస్ యస్ పి డి సి యల్ సి యం డి రఘుమా రెడ్డి లతో చర్చలు జరిపారు. మజ్లిస్ యం యల్ ఏ అహ్మద్ అబ్దుల్లా బలాల అభ్యర్ధన మేరకు సానుకూలంగా స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి ఆర్టిజన్ లను మానవీయ దృక్పథం తో తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. అదే సమయలో ఈ తరహ సంఘటనలు పునావృతం కాకూడదని మంత్రి జగదీష్ రెడ్డి ఆర్టిజన్ సంఘాల ప్రతినిధులకు సూచించారు. పునరావృతం అయితే ఉపెక్షింది లేదని ట్రాన్స్కో& జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు హెచ్చరించారు.