Tuesday, September 17, 2024
HomeతెలంగాణJammikunta: సైబర్ మోసాలు, డ్రగ్స్ పై అవగాహన అత్యవసరం

Jammikunta: సైబర్ మోసాలు, డ్రగ్స్ పై అవగాహన అత్యవసరం

యువత తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థి దశ నుండే కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సమయంలోనే మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాలను మలుపు తిప్పుతుందని హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి అన్నారు. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గాయత్రి డిగ్రీ కళాశాల, చాణక్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

- Advertisement -

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎసిపి శ్రీనివాస్ జి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… విద్యార్థి దశలోనే ప్రతి ఒక్క యువకుడు మంచి అలవాట్లను అలవర్చుకోవాలని మీరు వేసే అడుగు మీ జీవితాన్ని మార్పు చేస్తుందని ఇది గమనించి బంగారు భవిష్యత్తు కొరకు మంచి పునాది నిర్మించుకొని జీవితంలో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ మనిషిని మృగాన్ని చేస్తుందని మొదట హాయిగానే ఉంటుందని ఆ తర్వాతే పతనం ప్రారంభమవుతుందని డ్రగ్స్ కు బానిస అయితే మీరు నాశనం అవడమే కాకుండా మీ కుటుంబాన్ని కూడా నాశనం చేసినవారు అవుతారని అన్నారు. సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలను మీరు చూస్తున్నారని, సైబర్ కేటుగాళ్లకు మహా మేధావులే బలైపోతున్నారని అలాంటిది కేవలం వ్యవసాయం మీద ఆధారపడి జీవించే ఒక రైతు మోసపోవడం పెద్ద సమస్య కాదని ఆయన అన్నారు. మీరంతా కూడా రైతు నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు సైబర్ నేరాల పట్ల జరుగుతున్న మోసాలను వివరించి చెప్పాలని వారికి సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను బ్యాంకు అకౌంట్ ద్వారా అందచేస్తారని వారి ఖాతాలో డబ్బు జమ కాగానే కేటుగాళ్లు వల పన్నుతారని రైతును మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తారని వాటికి మీ తల్లిదండ్రులు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మనిషి జీవితంలో సెల్ఫోన్ ఒక భాగం అయిపోయిందని దానిని మంచికి వినియోగించుకుంటే నష్టం లేదని అనవసరమైన యాప్స్ డౌన్లోడ్ చేసుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దని ఇప్పటికే ఎంతోమంది ఆన్లైన్ గేమింగ్ ద్వారా లక్షల రూపాయలు అప్పులు చేసి ప్రాణాలు తీసుకున్నా ఘటనలు మనం ప్రతిరోజు చూస్తున్నామని మీరు కూడా అలాంటి వాటి ఉచ్చులో పడకూడదని అన్నారు. మీ నడవడిక మంచిగా ఉంటే మీ కుటుంబ బాగుంటుందని మీపై నమ్మకం పెట్టుకున్న మీ తల్లిదండ్రులను ఎలా రక్షించుకుంటారో అది మీ మీదనే ఆధారపడి ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ సిఐ వరంగంటి రవి, ఎస్సై టి. వివేక్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు, చాణిక్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దబ్బేట రవీందర్, పోలీస్ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News