Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Janasena-BRS: తెలంగాణలో జనసేన.. ఏపీలో బీఆర్ఎస్.. ఎవరికి నష్టం?

Janasena-BRS: తెలంగాణలో జనసేన.. ఏపీలో బీఆర్ఎస్.. ఎవరికి నష్టం?

- Advertisement -

Janasena-BRS: రానున్న ఎన్నికలలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు గతానికి మించి ఆసక్తికరంగా మారనున్నాయా? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే.. నిన్నటి వరకు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పుట్టినట్లు చెప్పుకుంటూ.. రాష్ట్రం తన చేతుల్లో ఉంటేనే శ్రేష్ఠమని చెప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా జాతీయ ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో కొట్లాడతామని ఢిల్లీకి చేరుకుంది. జాతీయ స్థాయి రాజకీయం అంటే తెలంగాణతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీ పాగా వేయాల్సి ఉంది.

ఇక, గులాబీ దళాధినేత ఎప్పుడైతే జాతీయ ప్రయోజనాలన్నారో.. అప్పుడు తెలంగాణలో కూడా ఇతర తెలుగు పార్టీలకు స్కోప్ దొరికినట్లే అవుతుంది. రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ తెలంగాణలో రాజకీయాలు వదులుకున్నా.. తెలుగుదేశం మాత్రం ఇప్పటికీ ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చేపడుతూనే ఉంది. ఈసారి ఎన్నికలలో టీడీపీ కూడా తెలంగాణలో మరింత యాక్టివ్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. దీనికి తోడు తెలంగాణలో కూడా భారీ ప్రేక్షకాదరణ ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో పోటీకి సిద్ధమవుతున్నారు.

ఈసారి ఏపీలో పూర్తిస్థాయిలో పోటీకి సిద్ధమవుతున్న జనసేన తెలంగాణలో కూడా పోటీచేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసుకుంటుంది. పోటీచేసేందుకు కేడర్ సిద్దంగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపునివ్వగా.. ఇప్పటికే 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేసినట్లు తెలంగాణ జనసేన ఇన్ చార్జి శంకర్ గౌడ్ వెల్లడించారు. ఆ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటిస్తామన్న శంకర్ గౌడ్.. ఇంకా మరిన్ని నియోజకవర్గాలలో కూడా అభ్యర్థుల పరిశీలన చేస్తామన్నారు.

మరి ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్.. తెలంగాణలో టీడీపీ, జనసేన పార్టీలు పోటీకి దిగితే రెండు రాష్ట్రాలలో ఎవరికి నష్టం అనే చర్చలు రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతున్నాయి. ఏపీలో పొత్తుకు సిద్దమవుతున్న జనసేన-టీడీపీ తెలంగాణలో కలిసి పోటీకి దిగితే ఎలా ఉంటుంది?.. ఒకవేళ వీళ్ళకి బీజేపీ కూడా తోడై రెండు తెలుగు రాష్ట్రాలలో మూకుమ్మడి పోటీకి సిద్ధమైతే పరిస్థితి ఏంటన్నది ఆసక్తి కరంగా కనిపిస్తుంది. అయితే.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుగా పోటీకి దిగితే ఏపీలో వైసీపీకి నష్టమని అంచనా ఉండగా.. తెలంగాణలో అదే బీఆర్ఎస్ పార్టీకి మేలు జరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అయితే.. అసలు పొత్తులు, ఎత్తులు క్లారిటీ వస్తే కానీ.. లాభ, నష్టాలలు అంచనా వేసే పరిస్థితి ఉండదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News