ఈ ఎన్నికల్లో అవినీతికి నిజాయితీకి మధ్య పోరాటం జరుగుతోందని, అక్రమంగా సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టి మళ్లీ ఎన్నికల్లో గెలిచి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వస్తున్న రాజకీయాలను మార్చాలని నియోజకవర్గ ప్రజలను కోరుతున్నానని సిపిఎం పార్టీ నియజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మోకు కనకారెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని గెలిపించుకోవాలన్నారు. జనగామ నియోజకవర్గంలో తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో గతంలో గెలిచి సేవ చేశాం, అదే స్ఫూర్తితో ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొంటున్నాం ఆశీర్వదించండన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని, నిరుద్యోగం, ధరల పెరుగుదలతో ప్రజలు విసుగు చెందుతున్నారని అన్నారు.
జనగామ జిల్లా కేంద్రంలో, చేర్యాల మున్సిపాలిటీలో కనీసం దోమల మందు కొట్టలేని ప్రభుత్వం ఈ నియోజకవర్గ ప్రజల ఓట్లు అడిగే కనీస అర్హత లేదని విమర్శించారు. బిఆర్ఎస్ వచ్చిన తర్వాత దేవాదుల నుండి జనగామకు చుక్క నీరు కేటాయించ లేదని, ఎవరు నియోజకవర్గం అభివృద్ధి చేస్తారో, ఎవరు పోరాటం చేశారో, ఎవరు ప్రజల పక్షాన ఉన్నారో ప్రజలు ఆలోచించాలని అన్నారు. జనగామకు గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని,పేదలకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదని ప్రజలు నిలదీస్తున్నారని ఆయన అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని, డబ్బు సంచులతో, మద్యంతో వస్తున్న రాజకీయ నాయకులను ప్రజలు గమనించాలని, తప్పుడు రాజకీయాలు డబ్బు రాజకీయాలు, దోపిడీ రాజకీయాలు మార్చకపోతే యువత భవిష్యత్తు ఉండదన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సిపిఎం పార్టీ అభ్యర్థి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇర్రి అహల్య, సీనియర్ నాయకులు బోట్ల శ్రీనివాస్, సిపిఎం జనగాం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, సీనియర్ నాయకులు ఎండి దస్తగిరి, పాము కృష్ణమూర్తి, గంగాపురం మహేందర్, ఆలేటి యాదగిరి, ప్రశాంత్, కమిటీ సభ్యులు పందిళ్ళ కళ్యాణి, దూసరి నాగరాజు, బిట్ల గణేష్, ధర్మ బిక్షం, ఎండి మైవెల్లి, ఎండి యాకూబ్, విప్లవ్ తదితరులు పాల్గొన్నారు.