Saturday, October 5, 2024
HomeతెలంగాణJivan reddy's Challenge: యుద్దానికి సిద్ధమా? నీకు దమ్ముంటే నాపై పోటీ చేయి

Jivan reddy’s Challenge: యుద్దానికి సిద్ధమా? నీకు దమ్ముంటే నాపై పోటీ చేయి

అరాచక శక్తుల జేఏసీకి అధ్యక్షుడే ధర్మపురి అరవింద్, ఆర్మూర్ లో అరవింద్ చేసింది రోడ్ షో కాదు మ్యాడ్ షో-జీవన్ రెడ్డి

“నిజామాబాద్ ఎంపీ అరవింద్..నీకు దమ్మూ ధైర్యం ఉంటే ఆర్మూర్ లో నాపై పోటీ చెయ్యి, నాతో యుద్దానికి సిద్ధమా? తొడగొట్టి చెబుతున్నా నిన్ను పడగొట్టి పాతి పెడతా.. నువ్వెక్కడ పోటీ చేసినా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిస్తాం. ఈ ఎన్నికలతో నీ పొలిటికల్ కెరియర్ క్లోజు” అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. నందిపేట్ మండలం తల్వేద గ్రామానికి చెందిన 500 మందికి పైగా యువకులు, వివిధ కుల సంఘాల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తామంతా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు, ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థవంత పాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నాయకత్వానికి వారు మద్దతు పలికారు.
అంకాపూర్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సమక్షంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి జీవన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి బీఆర్ ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు కల్పిస్తామని, రెట్టింపు గౌరవం ఉంటుందని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ గూటికి చేరిన యువకులు “దేశ్ కీ నేత కేసీఆర్, జై జీవనన్న, జై తెలంగాణ” అని చేసిన నినాదాలతో అంకాపూర్ మారుమోగింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అరవింద్ అడ్డగోలుగా వాగితే నాలుక చీరేస్తాం. అంబేద్కర్ చౌరస్తా లో బట్టలూడదీసి కొడతాం అని హెచ్చరించారు.

- Advertisement -


“నీకు దమ్ముంటే ఆర్మూర్ అభివృద్ధి పై చర్చకురా. అభివృద్ధి, సంక్షేమ పథకాలలో నీ వాటా ఎంతో చెప్పు. 3వేల కోట్ల రూపాయలతో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక్క విద్యుత్ సబ్సీడీలే రూ.320కోట్లు వచ్చాయి. నియోజకవర్గంలో 62 వేల మందికి రూ.2016, రూ.3016 చొప్పున ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. 62 వేల మందికి రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందుతోంది. 12 వందల మందికి దళితబంధు స్కీమ్ ద్వారా ద్వారా రూ. 10 లక్షల చొప్పున వచ్చి వారికిష్టమైన యూని ట్లు పెట్టుకొని ఆత్మ గౌరవ పతాకను ఎగురేస్తున్నారు.
నాలుగేళ్లు ముఖం చాటేసి ఇప్పుడు ఆర్మూర్ వచ్చిన ఎంపీ అరవింద్ ను ఎవరూ పట్టించుకోరు. నిజామాబాద్ జిల్లా బీజేపీలో తొమ్మిది గ్రూపులు ఉన్నాయి. ఆర్మూర్ లో ఉన్న తొమ్మిది మంది తామే అభ్యర్థులు అని తిరుగుతున్నారు. అవినీతికి ప్యాంట్, చొక్కా వేస్తే అది ఎంపీ అరవింద్ రూపం. డబ్బు తినమరిగిన అరవింద్ బీజేపీ నాయకుల మోచేతికి బెల్లం రాసి నాకిస్తూ నువ్వే అభ్యర్థివి అంటూ అవినీతి ఆట ఆడుతుండు. ప్రజల కష్ట సుఖాలు ఏనాడూ పంచుకోని అరవింద్ ను ఏ గ్రామం వెళ్లినా ప్రజలు చితకబాదడం ఖాయం. అరవింద్ ప్రజల మధ్య పంచాయితీలు పెట్టే తాకట్లమారి.
అరాచక శక్తుల జేఏసీకి అధ్యక్షుడు
పసుపుబోర్డు తేకుండా రైతుల వెన్ను విరిచిన మోసగాడు. ఆర్మూర్ లో అరవింద్ చేసింది రోడ్ షో కాదు మ్యాడ్ షో. అదొక బ్యాడ్ షో. ఆర్మూర్ ను నిండా ముంచే కుట్రతో చేసిన వెకిలి చేష్టలు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీని బొంద పెడతాం. కర్ణాటక ప్రజలు చెప్పుతో కొట్టినా బీజేపీకి బుద్ధి రాలేదు. అరగుండు అరవింద్ ఎన్ని చిల్లర వేషాలేసినా నేను 60వేల మెజారిటీతో మూడో సారి కూడా గెలుస్తా. కవితక్కపై నీకెందుకంత అక్కసు. మంత్రి కేటీఆర్ ని విమర్శించే స్తాయా నీది. వారి కాలిగోటికి కూడా అరవింద్ సరిపోడు. కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం. అభివృద్ధి, సంక్షేమం చూసి సకల జనుల మద్దతు బీఆర్ఎస్ కే లభిస్తోంది అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News