Justice P.C. Ghose Commission report on Kaleshwaram project: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 27న హైదరాబాద్‌కు రానుండటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన పర్యటన అనంతరం, నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంతకీ ఆ నివేదికలో ఏముంది? ఎవరి మెడకు చుట్టుకోనుంది? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
విచారణ పర్వం సాగిందిలా:
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా లోపాలు, డిజైన్ల మార్పు, అంచనాల పెంపు వంటి అంశాలపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే.2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (పీసీ ఘోష్) నేతృత్వంలో 2024 మార్చి 14న ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ప్రభుత్వం మొదట 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినప్పటికీ, విచారణ పరిధి విస్తృతంగా ఉండటంతో కమిషన్ గడువును పలుమార్లు పొడిగించారు. ఈ విచారణలో భాగంగా కమిషన్ సుమారు 110 మందిని విచారించింది. వీరిలో ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు, ఐఏఎస్ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. అంతేకాకుండా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, కాగ్ (CAG), జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికలను కూడా కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించింది.
అఫిడవిట్లు, క్రాస్ ఎగ్జామినేషన్లతో లోతైన దర్యాప్తు:
విచారణలో భాగంగా, కమిషన్ అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్ల నుంచి అఫిడవిట్లను స్వీకరించింది. ఆ తర్వాత వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను చేపట్టింది. ఈ క్రమంలో, ప్రాజెక్టు డిజైన్లను ఎవరు రూపొందించారు, మార్పులకు ఎవరు ఆదేశాలిచ్చారు, నిధుల కేటాయింపులు, వ్యయం ఎలా జరిగాయి అనే కోణంలో కమిషన్ లోతుగా దర్యాప్తు చేసింది. ముఖ్యంగా, నాటి ప్రభుత్వ పెద్దల పాత్రపై కూడా కమిషన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌లను కూడా విచారణకు పిలవాలని మొదట భావించినా, ప్రస్తుతానికి ఆ అవసరం లేదని కమిషన్ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
నెలాఖరులో నివేదిక.. ఉత్కంఠకు తెర:
పలు దఫాలుగా గడువు పొడిగింపుల అనంతరం, జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ తన విచారణను దాదాపుగా పూర్తి చేసింది. ప్రస్తుతం నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న జస్టిస్ పీసీ ఘోష్ హైదరాబాద్‌కు వచ్చి, తుది పరిశీలనల అనంతరం నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తోంది. ఈ నివేదికలో పేర్కొనే అంశాలు, సిఫార్సులు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


