ప్రజా సంక్షేమం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి కసిరెడ్డి నారాయణరెడ్డి తన స్వగ్రామం నుంచి కార్యకర్తలతో కలిసి మైసిగండి మైసమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కల్వకుర్తి పట్టణంలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ దగ్గరికి సి డబ్ల్యూ సి మెంబర్ చల్లా వంశీచందర్ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాసింగ్ ,ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిలతో చేరుకొని అప్పటికే ఫంక్షన్ హాల్ వద్ద వేచి చూస్తున్న నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్ అధికారి శ్రీనుకు నామినేషన్ పత్రాలను అందజేశారు.
భారీ ర్యాలీలో దారి పొడవున కార్యకర్తలు భారీ ఎత్తున బైక్లు కార్ల ర్యాలీని నిర్వహించారు. మధ్య మధ్యలో సాంస్కృతిక కళాకారులు మేళా తాళాలతో కసిరెడ్డికి స్వాగతం పలికారు. తన విజయం కోసం ప్రజలు సంపూర్ణంగా ముందుకు వచ్చి తమ మద్దతును ప్రకటిస్తున్నారని తెలిపారు. తన పర్యటనల పట్ల ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల పట్ల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని కసిరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆనంద్ కుమార్, మిర్యాల శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అభిమానులు పాల్గొన్నారు.