Teacher-led school Improvement : “బడికి వెళ్లామా.. పాఠం చెప్పామా.. ఇంటికి వచ్చామా” – ప్రభుత్వ ఉపాధ్యాయుల గురించి సమాజంలో పాతుకుపోయిన అభిప్రాయం ఇది. కానీ, అందరూ అలా ఉండరు కదా! కొందరు తాము అక్షరాలు దిద్దించే బడిని దేవాలయంగా భావిస్తారు, అక్కడి పిల్లలను కన్నబిడ్డల్లా చూసుకుంటారు. అలాంటి ఆదర్శమూర్తులే కామారెడ్డి జిల్లాలో ‘మేము సైతం’ అంటూ ఓ నిశ్శబ్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ చొరవ కోసం ఎదురుచూడకుండా, తమ జీతాల్లోంచే లక్షలు వెచ్చిస్తూ, శిథిలమైన బడులకు కొత్త శోభను అద్దుతున్నారు. అసలు వారెవరు? వారిలో ఆ స్ఫూర్తిని రగిలించిన కారణాలేంటి? తెలుసుకుందాం పదండి.
‘మేము సైతం’ అంటూ మహోద్యమం : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత కొత్తేమీ కాదు. అయితే, ఆ సమస్యలను చూసి చేతులు ముడుచుకుని కూర్చోకుండా, వాటి పరిష్కారానికి నడుం బిగించారు కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడాన్ని కూడా తమ బాధ్యతగా స్వీకరించారు.
వరదొచ్చినా… మేమున్నామంటూ భరోసా
గత ఆగస్టులో కురిసిన కుండపోత వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. పాఠశాలలు సైతం దెబ్బతిన్నాయి. ఈ కష్టకాలంలో పీఆర్టీయూ (PRTU) ఉపాధ్యాయ సంఘం ముందుకు వచ్చింది. జిల్లా అభివృద్ధి, విద్యార్థులను ఆదుకునేందుకు ఏకంగా రూ.7.06 లక్షల విరాళాన్ని ప్రకటించి, జిల్లా కలెక్టర్‌కు డీడీ అందజేసి తమ ఉదారతను చాటుకుంది.
ఒక్కడే సైన్యమై… రూ.3 లక్షల సాయం
బిచ్కుంద మండలం పుల్కల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆనంద్‌కుమార్ విద్యార్థుల వెతలు తీర్చడానికి ఒక సైన్యంలా కదిలారు. తన సొంత నిధులు రూ.2.50 లక్షలతో పాఠశాలలో మరుగుదొడ్లను నిర్మించారు. అంతేకాక, పిల్లల భద్రత, సాంకేతిక విద్య కోసం మరో రూ.50 వేలతో సీసీ కెమెరాలు, మానిటర్ ఏర్పాటు చేయించి అందరి మన్ననలు పొందారు.
పురస్కారమే స్ఫూర్తిగా…
గాంధారి ఎంపీపీఎస్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బొంపల్లి భవానికి ఇటీవల రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు రూ.10 వేల నగదు బహుమతి లభించింది. ఆ మొత్తానికి తన వంతుగా మరో రూ.10 వేలు కలిపి పాఠశాలకు కంప్యూటర్, ఇతర సామగ్రిని వితరణ చేశారు. గతంలోనూ ఆమె తన సొంత డబ్బుతో పాఠశాలకు రంగులు వేయించడం విశేషం.
ఆణిముత్యాలు మరెందరో…
ఈ స్ఫూర్తిదాయక ప్రయాణంలో మరికొందరు ఉపాధ్యాయులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. పెద్దకొడప్‌గల్ మండలం కుబ్యానాయక్‌తండా పాఠశాల ఉపాధ్యాయులు మారుతి, బాల్‌రాజ్ రూ.30 వేల విలువైన బోధనోపకరణాలు, సౌండ్ సిస్టమ్ అందించారు.
ఎల్లారెడ్డి జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్, మరో ఇద్దరు ఉపాధ్యాయులతో కలిసి వెల్లుట్ల పాఠశాలకు రూ.25 వేల విలువైన ఫర్నీచర్ అందజేశారు.
కామారెడ్డి పట్టణంలో ఉత్తమ ఉపాధ్యాయులందరూ కలిసి అవార్డీ టీచర్స్ అసోసియేషన్ గా ఏర్పడి, అంబేడ్కర్‌నగర్ పాఠశాలకు ఫర్నీచర్ అందించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.
ఈ గురువులు కేవలం ప్రభుత్వ ఉద్యోగులు కాదు, రేపటి తరం కోసం తమ సంపాదనను సైతం త్యాగం చేస్తున్న మహనీయులు. వీరిని చూసైనా, ప్రభుత్వాలు, సమాజం స్పందించి సర్కారు బడుల అభివృద్ధికి మరింత చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


