Sunday, November 16, 2025
HomeతెలంగాణAssociation for elderly parents : తల్లిదండ్రులను వేధిస్తే.. 'తాతల' సంఘం తాటతీస్తుంది! ఎక్కడంటే?

Association for elderly parents : తల్లిదండ్రులను వేధిస్తే.. ‘తాతల’ సంఘం తాటతీస్తుంది! ఎక్కడంటే?

Association for elderly parents’ rights : యువజన సంఘాలు, మహిళా సంఘాల గురించి విన్నాం. కానీ, కేవలం ‘తాతల’ కోసమే ఓ సంఘం ఉందని మీకు తెలుసా? కన్న పిల్లలే కడుపున పుట్టినందుకు కష్టాలు పెడుతుంటే, ఆ వృద్ధుల కన్నీళ్లు తుడవడానికి, వారికి అండగా నిలవడానికి ఓ గ్రామంలోని పెద్దలందరూ ఏకమయ్యారు. తల్లిదండ్రులను వేధించే పిల్లల తాట తీస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని మోతె గ్రామంలో వెలసిన ఈ వినూత్న ‘తాతల సంఘం’ కథేంటి? ఇది ఎలా పనిచేస్తుంది..?

- Advertisement -

కామారెడ్డి జిల్లా, లింగంపేట మండలంలోని మోతె గ్రామంలో, వయసు మళ్లిన తల్లిదండ్రులను పిల్లలు సరిగా చూసుకోకపోవడం, వేధించడం వంటి ఘటనలు ఎక్కువయ్యాయి. కొడుకులు, కోడళ్ల చేతిలో అవమానాలు భరించలేక, తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలామంది వృద్ధులు మదనపడేవారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు.

తాతల సంఘం’ ఆవిర్భావం : గ్రామ మాజీ సర్పంచ్ రాజిరెడ్డి చొరవతో, 2010లో ఈ ‘తాతల సంఘం’ అధికారికంగా ఏర్పాటైంది.
చర్చల నుంచి ఆచరణకు: గ్రామంలోని వృద్ధులంతా కలిసి తమ సమస్యలపై చర్చించుకుని, ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు.
రిజిస్ట్రేషన్: ఈ సంఘాన్ని పక్కాగా రిజిస్టర్ చేయించి, దానికి ఓ అధికారిక రూపాన్నిచ్చారు. ప్రస్తుతం ఈ సంఘంలో 40 మంది వృద్ధులు సభ్యులుగా ఉన్నారు.

ఎలా పనిచేస్తుంది : ఈ సంఘం పనితీరు చాలా విలక్షణంగా, ప్రభావవంతంగా ఉంటుంది.
ఫిర్యాదు స్వీకరణ: తమ పిల్లలు వేధిస్తున్నారని ఏ వృద్ధుడైనా సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు.

అనునయం: వెంటనే, సంఘ సభ్యులందరూ కలిసి ఆ ఇంటికి వెళ్లి, పిల్లలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని అనునయంగా వివరిస్తారు.
సూచన, హెచ్చరిక: అప్పటికీ వారిలో మార్పు రాకపోతే, పద్ధతి మార్చుకోవాలని సూచిస్తారు, అవసరమైతే గట్టిగా హెచ్చరిస్తారు.

గాంధేయ మార్గంలో నిరసన: మరీ మంకుపట్టుతో ఉంటే, చివరి అస్త్రంగా ఆ ఇంటి ముందే వంటావార్పు చేపట్టి, శాంతియుతంగా నిరసన తెలుపుతారు. ఈ సంఘం ఏర్పాటుతో, గ్రామంలో వృద్ధులపై వేధింపులు చాలావరకు తగ్గాయని, ఇప్పుడు తమకు ఓ ధైర్యం వచ్చిందని సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కకుండా, గ్రామస్థాయిలోనే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటూ, ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు. ఈ సంఘం సేవలను గుర్తించిన నాటి ఎమ్మెల్యే జాజుల సురేందర్, వారికి ప్రత్యేకంగా ఓ భవనాన్ని కూడా నిర్మించి ఇవ్వడం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad