Illogical reservation allocation : ఆ ఊరిలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక్క ఓటరు కూడా లేరు. కానీ సర్పంచి స్థానం మాత్రం వారికే రిజర్వ్ అయ్యింది. ఇది కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలలో నెలకొన్న వింత పరిస్థితి. అధికారుల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ అశాస్త్రీయంగా ఉందని, క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా ఉందని స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లే లేనప్పుడు పోటీ చేసేదెవరు? గెలిచేదెవరు? చివరికి పాలకవర్గం లేక మా గ్రామాల అభివృద్ధి కుంటుపడిపోదా? అంటూ వారు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.
అభివృద్ధికి గొడ్డలి పెట్టు : జిల్లా అధికారులు ఇటీవల గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. అయితే, ఈ కేటాయింపులు అనేక గ్రామాల్లో వివాదాలకు దారితీశాయి. కొన్ని గ్రామాల్లో అసలు ఓటర్లే లేని సామాజిక వర్గాలకు పదవులను కేటాయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్నిచోట్ల, గత మూడు పర్యాయాలుగా ఒకే సామాజిక వర్గానికి కేటాయించిన స్థానాన్ని, నాలుగోసారి కూడా వారికే రిజర్వ్ చేయడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ గ్రామాలకు ఎన్నికలు జరగక, పాలకవర్గం ఏర్పడక, ప్రత్యేకాధికారుల పాలనతో అభివృద్ధి నిధులు ఆగిపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై పలు గ్రామాల ప్రజలు ఏకమై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.
వింత కేటాయింపులకు కొన్ని ఉదాహరణలు: చావనితండా (పెద్దకొడప్‌గల్ మండలం): ఇక్కడ సర్పంచి స్థానాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. మొత్తం 8 వార్డుల్లో 4 బీసీలకు, 4 ఎస్సీలకు కేటాయించారు. కానీ, ఈ తండాలో ఒక్కటంటే ఒక్క ఎస్సీ ఓటరు కూడా లేరు. దీంతో ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
అంకోలు (నస్రుల్లాబాద్ మండలం): ఈ గ్రామ సర్పంచి స్థానాన్ని ఎస్టీలకు కేటాయించారు. ఇక్కడ కూడా ఒక్క ఎస్టీ ఓటరు కూడా నివసించడం లేదు.
కాటేపల్లి తండా (పెద్దకొడప్‌గల్ మండలం): 2019 సర్పంచి ఎన్నికల్లో ఇక్కడి స్థానాన్ని ఎస్సీలకు కేటాయించారు. ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు లేకపోవడంతో ఆ ఎన్నిక జరగలేదు. ఫలితంగా గత ఐదేళ్లుగా ఈ తండా ప్రత్యేకాధికారి పాలనలోనే మగ్గుతోంది. ఇప్పుడు తమ గ్రామాల పరిస్థితి కూడా ఇలాగే తయారవుతుందేమోనని చావనితండా, అంకోలు గ్రామస్థులు భయపడుతున్నారు.
అధికారుల వాదన ఏంటి : ఈ కేటాయింపులపై అధికారులు స్పందిస్తూ, 2011 జనాభా లెక్కల ఆధారంగానే రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో ఆయా గ్రామాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. అయితే, గడిచిన దశాబ్ద కాలంలో గ్రామాల్లో జనాభా పరంగా, సామాజికంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా పాత లెక్కల ప్రకారమే కేటాయింపులు చేయడం సరికాదని ప్రజలు వాదిస్తున్నారు.


