నాగర్ కర్నూల్ జిల్లాలో కంటి చూపుతో బాధ పడుతున్న ప్రతి ఒక్కరూ కంటి వెలుగులో పరీక్షలు చేయించుకునేలా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సూచించారు. కంటి వెలుగు కార్యక్రమ సన్నద్ధతపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించగా సెక్రెటరేయట్ నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డి.జి.పి అంజనీ కుమార్ పాల్గొన్నారు. ఈ నెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని, ఆ రోజు రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు అందరూ ఖమ్మంలో ఉంటారు కాబట్టి మిగిలిన 32 జిల్లాలలో 19వ తేదీన ఉదయం 9 గంటలకు అన్ని బృందాల ద్వారా ప్రారంభించుకోవాలని మార్పు సూచించారు.
అందరూ ఒకే రోజు వస్తే.. రోజుకు 120 నుండి 130 మందిని రప్పించుకొని పరీక్షలు నిర్వహించాలని హరీష్ రావు ఆదేశించారు. దగ్గరి చూపు సమస్య ఉన్నవారికి అక్కడే కంటి అద్దాలు ఇచ్చి పంపించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని వైద్య శిబిరాలకు అవసరమైన యంత్రాలు, కంటి చూపు అద్దాలు అన్ని సమకూర్చినట్టు సర్కారు వెల్లడించింది.