కమిషనరేట్ లోని పోలీస్ స్టేషన్లు, టాస్క్ ఫోర్స్ విభాగాలకు శుక్రవారం నాడు పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు ద్విచక్ర వాహనాలను అందజేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరిగింది. గస్తీ నిర్వహణతోపాటు శాంతిభద్రతలకు సంబంధించిన వివిధ రకాల విధినిర్వహణ కోసం ఈ వాహనాలను వినియోగించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ వివిధ రకాల విధుల నిర్వహణకోసం అందజేసిన వాహనాలను చాలా జాగ్రత్త వినియోగించాలన్నారు. సదరు వాహనాలను తమసొంత వాహనాలనుగా భావించి వినియోగించాలని చెప్పారు. ఏదైనా ఫిర్యాదు అందిన వెంటనే సత్వరం సదరు ప్రాంతానికి చేరుకుని ప్రాథమిక సమాచారం సేకరించి, సేవలందించాలని సూచించారు. సత్వరం స్పందించి సేవలందించడం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందుతుందని తెలిపారు. ప్రజలకు సేవలందించేందుకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపిలు ఎస్ శ్రీనివాస్ (శాంతిభద్రతలు), జి చంద్రమోహన్ (పరిపాలన), ట్రైనీ ఐపిఎస్ అధికారి గైట్ మహేష్ బాబాసాహెబ్, ఏఆర్ ఏసిపి సి ప్రతాప్, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు, ఆర్ఎస్ఐలు శేఖర్ బాబు, సురేష్ లతోపాటుగా పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.