బండి సంజయ్.. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఎక్కడని బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎం.పి. బండి సంజయ్ ను సిపిఎం కరీంనగర్ నగర కార్యదర్శి గుడికందుల సత్యం ప్రశ్నించారు. స్థానిక ప్రెస్ భవన్ లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో హైవేపై గల రైల్వే క్రాసింగ్ వద్ద చీటికీమాటికీ రైల్వే గేటు వేయడం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రోజుకు 18 నుండి 20 సార్లు గేటు పడడం మూలంగా కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లే వారు, అత్యవసరంగా ఆసుపత్రులకు వెళ్లే అంబులెన్స్ లు సైతం ట్రాఫిక్ లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 సంవత్సరాల క్రితమే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు తెచ్చానని చెప్పుతున్న కరీంనగర్ ఎం.పి. బండి సంజయ్ నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, రాష్ట్రంలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తూ కరీంనగర్ ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జికి 154 కోట్ల నిధులు తెచ్చానని రెండుసార్లు పాలాభిషేకాలు చేయించుకొని ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా చేయకపోవడం, పనులు ప్రారంభించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ఎం.పి. సంజయ్ మాట్లాడితే మసీదులు కూల్చుతా, తనను గెలిపిస్తే కరీంనగర్ ను “కరి”నగర్ చేస్తా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తప్ప, ప్రజలకు ఉపయోగపడే పనులు ఒక్కటైనా చేయరా..? అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి రాష్ట్రంలో అధ్యక్షులుగా, బి.జె.పి. పార్టీ నుండి కరీంనగర్ ఎం.పి.గా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ నుండి కొత్తపెళ్లి మనోహరాబాద్ వెళ్లే రైల్వే మార్గానికి నిధులు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాలుగా కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం నుండి ఏం నిధులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. 20 రూపాయలకే పాల ప్యాకెట్ దొరుకుతుంది కదా అని పలుమార్లు పాలాభిషేకాలు చేసుకుంటున్నారే గాని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించడం లేదని ఎద్దేవా చేశారు.
మసీదులు కూల్చుతా అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, మతాల మధ్య వైశామ్యాలు పెంచుతూ,ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముస్లిం సోదరులను బిజెపి కార్యాలయాలకు తీసుకెళ్లి ఇఫ్తార్ విందులు ఇవ్వడం ఓట్లు దండుకోవడం కోసం ఆడుతున్న నాటకాలేనని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం చెబుతారన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని కరీంనగర్ పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేసేంత వరకు ప్రజల పక్షాన సిపిఎం అండగా ఉండి పోరాడుతుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు పుల్లెల మల్లయ్య, జి.తిరుపతి, కొంపల్లి సాగర్, కె.అరవింద్, నగర నాయకులు కోనేటి నాగమణి, గాజుల కనకరాజు, రత్నం సురేష్ తదితరులు పాల్గొన్నారు.